WPL 2024 Final Delhi Capitals VS RCB : డబ్ల్యూపీఎల్ 2024 రెండో సీజన్ ఆఖరి అంకానికి వేళైంది. ఇప్పటివరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లు, హోరాహోరీగా జరిగిన పోరాటాలు, నాటకీయ మలుపులతో ముందుకు సాగిన ఈ అమ్మాయిల లీగ్‌లో చివరి రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గత సీజన్లోనే ట్రోఫీని ముద్దాడేందుకు చివరి వరకు పోరాడి ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ దిల్లీ క్యాపిటల్స్‌తో తొలిసారి ఫైనల్ చేరి టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మరి కొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం.
దిల్లీ క్యాపిటల్స్ బలాబలాల విషయానికొస్తే మెగ్ లానింగ్ సారథ్యంలో ఈ జట్టు ఉత్తమ ప్రదర్శనతో ఇక్కడి దాకా వచ్చింది. లీగ్ దశలో 8 మ్యాచులు ఆడి 6 విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కెప్టెన్ లానింగ్ (308 పరుగులు) బ్యాటింగ్‌లో మంచి జోష్‌లో ఉంది. షెఫాలి వర్మ (265 పరుగులు), అలీస్ క్యాప్సీ (230 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (235 పరుగులు) కూడా బ్యాటింగ్‌లో ఊపు మీదున్నారు. బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కాప్ అగ్రస్థానంలో ఉంది. ఈమె పవర్‌ప్లేలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెడుతూ ముందుకు సాగుతోంది. పేస్ ఆల్‌రౌండర్ మరిజేన్ కాప్ (11), రాధ యాదవ్ (10), స్పిన్నర్లు జొనాసెన్ (11) నిలకడగానే ప్రదర్శన చేస్తున్నారు.
-
The Captains are 𝗥𝗘𝗔𝗗𝗬 for the summit clash 🏆
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2024
ARE. YOU❓ #TATAWPL | #DCvRCB | #Final | @DelhiCapitals | @RCBTweets | @mandhana_smriti pic.twitter.com/Na4UY55Sy4
ఇక లీగ్‌లో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చిన జట్టు ఆర్సీబీ. లీగ్ దశలో 8 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఎలిమినేటర్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయికి షాకిచ్చింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ దూకుడు ప్రదర్శిస్తూ కీలకంగా వ్యవహరిస్తోంది. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో ఉంది. 312 రన్స్ చేసిన ఈమె 7 వికెట్లూ కూడా తీసింది. ఇక స్మృతి మంధాన (269 పరుగులు), రిచా ఘోష్ (240 పరుగులు) పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తున్నారు. వీరు కూడా ఫైనల్లో బ్యాట్‌కు సమాధానం చెబితే ఆర్సీబీకి తిరుగుండదనే చెప్పాలి. కానీ బౌలింగ్ విభాగంలో ఆ జట్టు కాస్త బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆశ (10), సోఫీ మోలనూ (9), శ్రేయాంక, రేణుక, వేర్‌హామ్ రాణించాలి. చూడాలి మరి ఈ ప్రతిష్టాత్మక తుది పోరులో ఎవరు గెలుస్తారో.