D Gukesh Tamilnadu CM Prize Money : చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుని యంగ్ చెస్ ప్లేయర్ గుకేశ్ చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
దీంతో చిన్న వయసులోనే (18 ఏళ్లు) ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన భారత ఆటగాడు డి గుకేశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్ అద్భుత విజయం సాధించడంపై స్టాలిన్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల ప్రైజ్‌మనీని అందిస్తున్నట్లు తెలిపారు.
"గుకేశ్ సాధించిన అద్భుత విజయాన్ని మనందరం గౌరవించాలి. అతి పిన్న వయస్కుడైన ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ సంతోషంలో అతడికి రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నాను. జాతి గర్వపడేలా చేసిన అతడికి నా ప్రత్యేక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని ఘనతలు అతడు సాధించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను" అని స్టాలిన్ పోస్టు పెట్టారు.
గుకేశ్ నికర విలువ మూడింతలు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. దీంతో అతడి నికర విలువ ప్రస్తుతం రూ.8.26 కోట్ల నుంచి రూ. 21 కోట్లకు పెరిగింది. చెస్ ద్వారా అతడి ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందని ఔట్‌లుక్ పేర్కొంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన లిరెన్ రూ.9.75 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్ మొత్తం నగదు బహుమతి రూ.21.17 కోట్లు. ఒక గేమ్ గెలిచిన ప్లేయర్‌కు రూ.1.69 కోట్లు వస్తాయి. మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్‌కు రూ.5.07 కోట్లు, రెండు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు వచ్చాయి. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు.
గేమ్ ఎలా సాగిందంటే?
గురువారం జరిగిన 14వ రౌండ్‌లో ఎంతో ఉత్కంఠగా సాగిన గేమ్‌లో చివరికి గుకేశ్ విజయాన్ని అందుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను దక్కించుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అయితే వాస్తవానికి బుధవారమే ఈ ఫలితం తేలాల్సింది. అయితే సుమారు 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్‌ను పంచుకున్నారు. కానీ విజయం కోసం 18 ఏళ్ల గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ, 32 ఏళ్ల లిరెన్ చాలా కూల్‌గా ఆడి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. మరోవైపు గురువారం జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ విజేతగా అవతరించాడు.
చెస్ ప్రపంచ సింహాసనంపై తెలుగబ్బాయి! - 11 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటిల్ తెచ్చాడుగా!
ఇప్పుడు కూడా అదే ఆలోచనతో బరిలోకి దిగుతాం - మాకేం ఆందోళన లేదు! : గిల్