India Women Eliminated From T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత అమ్మాయిలకు నిరాశే మిగిలింది. సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో అమ్మాయిలు ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.
తాజాగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. దాయాది జట్టు 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అయిపోయింది. 54 పరుగులతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఇక దాయాది జట్టు ఓటమితో భారత్ సెమీస్ ఆశలు కూడా గల్లంత్తయ్యాయి. న్యూజిలాండ్ దెబ్బకు దాయాది దేశాలు రెండూ ఇంటిదారి పట్టాయి.
మ్యాచ్ సాగిందిలా - ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (28) టాప్ స్కోరర్ నిలిచింది. బ్రూక్ హ్యాలీడే (22), సోఫి డివైన్ (19), జార్జియా ప్లిమ్మర్ (17) పరుగులు చేశారు. పాక్ బౌలర్ నష్రా సంధు మూడు వికెట్లు తీసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అయింది. ఫాతిమా సనా (21) పరుగులు చేసింది. మునీబా అలీ (15) కూడా నామమాత్రపు పరుగులు చేసింది. ఇక మిగతా బ్యాటర్ మరెవరు కూడా రెండంకెల స్కోర్ అందుకోలేదు. అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టింది.
గ్రూప్ ఏ సెమీస్ బెర్తులు వీరిదే - కాగా, మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ - ఏ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచులు ఆడి నాలుగింటిలోనూ విజయం సాధించింది. కివీస్ జట్టు నాలుగు మ్యాచులు ఆడి మూడింటిలో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆడిన నాలుగు మ్యాచులలో రెండు గెలిచిన భారత్ జట్టు ఇంటిదారి పట్టింది. పాకిస్థాన్ ఒక విజయం మాత్రమే సాధించి నిష్క్రమించింది. శ్రీలంక అన్ని మ్యాచులలోనూ పరాజయం పొందింది. గ్రూప్ - బీలో ఇంకా సెమీస్ బెర్త్‌లు ఖరారు అవ్వలేదు.
రోజుకు 1,500 క్రికెట్ బాల్స్ ఉత్పత్తి - అంతర్జాతీయ మ్యాచుల్లో వాడే SG బంతుల గురించి తెలుసా?
'ఆ చర్చ అనవసరం - అలా చేయడం మానండి' - కోహ్లీపై గంభీర్ కీలక కామెంట్స్!