Virat Kohli Fitness : టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ విషయంలో విరాట్‌ను అనుసరించే వాళ్లు చాలా మందే ఉంటారు. పైగా కింగ్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ఎదగడానికి ప్రధాన కారణం కూడా ఫిట్‌నెస్సే. అయితే తాజాగా విరాట్ ఫిట్‌నెస్‌పై అనుష్క మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఏముందంటే?
'నో జంక్, షుగర్ ఫుడ్స్' - "నిజాయతీగా చెబుతున్నాను. కోహ్లీ ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో అత్యంత కఠినంగా ఉంటాడు. ప్రస్తుతం సినీపరిశ్రమలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతున్నారు. విరాట్ వేకువజామునే కచ్చితంగా నిద్ర లేస్తాడు. కార్డియో లేదా హిట్ ట్రైయినింగ్ చేస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపు నాతో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడు. అతడి డైట్ కూడా చాలా క్లీన్‌గా ఉంటుంది. జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు వాటిల్లో అస్సలు ఉండవు. అతడు బటర్ చికెన్ తిని 10 ఏళ్లు అవుతుందంటే మీరు నమ్ముతారా?" అని అనుష్క శర్మ వీడియోలో వ్యాఖ్యానించారు.
'తగినంత విశ్రాంతి - నిద్రలో రాజీపడడు'
నిద్ర విషయంలో కోహ్లీ అసలు రాజీపడడని అనుష్క శర్మ చెప్పుకొచ్చారు. తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకొంటాడని తెలిపారు. చురుగ్గా ఉండటానికి, అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి విశ్రాంతి చాలా కీలకమని పేర్కొన్నారు. "రెస్ట్ అనేది పూర్తిగా మన చేతుల్లో ఉండే అంశమని విరాట్ చెబుతుంటాడు. జీవితంలోని ప్రతి అంశానికి కట్టుబడి ఉండటమే అతడిని ప్రపంచస్థాయి క్రికెటర్‌ను చేసింది. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది" అని అనుష్క శర్మ వీడియోలో వివరించారు.
పెర్త్‌లో సెంచరీ - అడిలైడ్‌లో రాణించేనా?
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో టెస్టు శతకం కోసం 16 నెలలుగా ఉన్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు తొలి టెస్టులో కోహ్లీ తెరదించాడు. అడిలైడ్‌లో శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్ట్ కోసం ప్రస్తుతం నెట్స్‌లో విరాట్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్ మళ్లీ అదే తంతు - ఐసీసీ సమావేశం వాయిదా!