TeamIndia vs New Zealand 2024 : ఇటీవలే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా ఘన విజయం అందుకుంది. 2024 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు మెరుగుపరచుకుంది. ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దృష్ట్యా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకం. ఈ టెస్ట్ సిరీస్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతుంది. భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నేటి నుంచి(అక్టోబర్ 16) బెంగళూరులో, రెండో టెస్టు అక్టోబర్ 24న పూణేలో, మూడో టెస్టు నవంబర్ 1న ముంబయిలో జరుగుతాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలంటే?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జూన్ 15 వరకు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ ఆడాలంటే భారత్ తదుపరి 8 టెస్ట్ మ్యాచుల్లో 5 గెలవాలి. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంటే భారత్‌కు తిరుగుండదు. అనంతరం ఆస్ట్రేలియాలో జరిగే 5 మ్యాచ్‌ల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిచినా సరిపోతుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుల్లో ఎవరిది పైచేయి? (TeamIndia vs New Zealand Head to Head Records)
భారత్, న్యూజిలాండ్ టెస్ట్ రికార్డుల్లో టీమ్ ఇండియాదే పైచేయి. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య మొత్తం 62 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. అందులో 22 మ్యాచుల్లో భారత్ గెలవగా, కేవలం 13 మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. 27 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్ విజయాల్లో 17 స్వదేశంలో సాధించగా, 5 విదేశీ పిచ్‌లపై నెగ్గింది.
Match Day Loading! 🟩⬜️⬜️
— BCCI (@BCCI) October 15, 2024
The #INDvNZ Test Series kicks off tomorrow in Bengaluru 👌👌
🏟️ M. Chinnaswamy Stadium
⏰ 9:30 AM IST
💻📱 https://t.co/Z3MPyeKtDz#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/hPooKut1wB
స్వదేశంలోనూ భారత్‌దే ఆధిపత్యం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదే వేదికపై 12 ఏళ్ల తర్వాత ఇరు జట్లు తలపడనున్నాయి. 2012లో చివరిసారిగా తలపడ్డాయి. అప్పుడు భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను నెగ్గింది.
1988 తర్వాత ఒక్క విజయం లేదు - గత కొన్నేళ్లుగా టెస్టుల్లో న్యూజిలాండ్ ప్రదర్శన పేలవంగా కనిపిస్తోంది. గతంలో భారత పర్యటనలో కూడా కివీస్ అంతగా ఆకట్టుకునేలా ప్రదర్శన కనబరచలేదు. భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో 36 ఏళ్లుగా న్యూజిలాండ్ ఒక్క విజయం కూడా సాధించలేదు. 1988లో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియాపై న్యూజిలాండ్ చివరిసారిగా విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌పై ఆడిన 18 టెస్టుల్లోనూ ఒక్క విజయాన్ని దక్కించుకోలేదు. దీంతో ప్రస్తుత సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. కాగా, 2021లో ప్రపంచ టెస్టు ఛాంపియన్స్(డబ్ల్యూటీసీ) టైటిల్ గెలిచిన కివీస్ ఆ దూకుడుని సుదీర్ఘ కాలం కొనసాగించలేకపోయింది.
ఎవరి బలమెంత?
బంగ్లాదేశ్‌ను టెస్ట్, టీ 20 సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ సూపర్ ఫామ్‌లో ఉంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సీనియర్ ఆటగాళ్లు, స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది 15 టెస్టులు ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 2 సెంచరీలు, ఒక అర్థ సెంచరీ మాత్రమే చేశాడు. బంగ్లాతో సిరీస్‌లో రోహిత్ విఫలమయ్యాడు. కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ సాధించి దాదాపు ఏడాది అవుతోంది.
యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, పంత్, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజాతో స్పిన్ విభాగం బలంగా ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌తో కూడిన పేస్ త్రయమే బరిలోకి దిగే అవకాశం ఉంది.
మరోవైపు శ్రీలంక గడ్డపై 0-2తో వైట్‌వాష్‌కు గురైన న్యూజిలాండ్ ఫామ్ లేక తంటాలు పడుతోంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన టామ్ లేథమ్ కివీస్‌ను ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. లంకలో స్పిన్ ఆడలేక తేలిపోయిన కివీస్, బలమైన భారత స్పిన్నర్లను ఎదుర్కోబోతోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వైఫల్యం జట్టును ఘోరంగా దెబ్బతీస్తోంది. రచిన్ రవీంద్ర, లేథమ్, కాన్వే, మిచెల్‌లతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్న వీరంతా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లోనూ కివీస్ ఇబ్బంది పడుతోంది. పేసర్ ఒరూర్కె, స్పిన్నర్ అజాజ్ పటేల్‌పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్‌లో సత్తాచాటాలంటే సౌథీ, శాంట్నర్, హెన్రీ లాంటి సీనియర్లు రాణించాల్సిన అవసరం ఉంది.
𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗡𝗲𝘄 𝗭𝗲𝗮𝗹𝗮𝗻𝗱
— BCCI (@BCCI) October 15, 2024
𝘛𝘩𝘦 𝘗𝘳𝘦𝘭𝘶𝘥𝘦 𝘣𝘺 𝘙 𝘈𝘴𝘩𝘸𝘪𝘯#TeamIndia 🇮🇳 is back in whites 🤍
One sleep away from Test No.1#INDvNZ | @IDFCFIRSTBank | @ashwinravi99 pic.twitter.com/lzVQCrtaLh
మొదటి టెస్టుకు వర్షం ముప్పు(TeamIndia vs New Zealand Rain)
బెంగళూరులో జరగనున్న తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం నుంచే బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు బెంగళూరులో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీమ్ స్క్వాడ్‌లు ఇవే
భారత టెస్ట్ స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.
న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (మొదటి టెస్టుకు), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విలియం ఓ రూర్కే, ఎజాజ్ పటేల్, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, ఇష్ సోథి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
ఒక్క రోజులోనే కోహ్లీ సంపాదను దాటేసిన మాజీ క్రికెటర్! - ఎవరంటే?
కివీస్‌తో టెస్ట్ సిరీస్ - రోహిత్ శర్మను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు