T20 World Cup Best Fielder Award : వన్డే ప్రపంచకప్‌లో బెస్ట్ ఫీల్డర్లకు మెడల్స్ ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించిన బీసీసీఐ ఇప్పుడు టీ20ల్లోనూ అదే ఫాలో అవుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ చేసిన టీమ్ఇండియా ప్లేయర్‌ను సత్కరించింది. అయితే ఈ మెడల్‌ను ఎప్పుడూ బౌలింగ్ కోచ్ దిలీప్ ఇస్తారు. కానీ ఈ సారి మాత్రం వినూత్నంగా ఓ అభిమానితో మెడల్ ఇప్పించారు. ఇంతకీ ఆ స్పెషల్ అభిమాని ఎవరంటే?
"టీ20 క్రికెట్‌లో ప్రతి బాల్ ఇంపార్టంటే. వచ్చిన అవకాశాలను అందుకోవడంపై మనం దృష్టి సారించాలి. అందకు చక్కటి ఉదాహరణ అక్షర్ పటేల్. క్యాచ్ అండ్ బౌల్ అందుకొని జట్టు విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. విరాట్ మైదానంలో కదిలిన విధానం కూడా ఎంతో అద్భుతంగా అనిపించింది. ఈ మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆటతీరుతో చక్కగా ఆకట్టుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌నే 'ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది" అంటూ అవార్డును రివీల్ చేశారు బౌలింగ్ కోచ్ దిలీప్.
అయితే ఆ మ్యాచ్ కోసం వచ్చిన సుబేక్ అనే అభిమాని చేతుల మీదగా సిరాజ్‌కు ఈ మెడల్‌ను అందజేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇలా చేసినందుకు బౌలింగ్ కోచ్‌ను క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. ఇక సిరాజ్ ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చాడు. ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, . న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలో సునాయసంగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 పరుగులు: 37 బంతుల్లో: 4x4, 3x6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రిషభ్ పంత్ (36* పరుగులు) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్, బెంజామిన్ వైట్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.