Suryakumar on Rohit Captaincy : టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మపై భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా రోహిత్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సందర్భంగా సూర్య మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
'రోహిత్ నుంచి అది నేర్చుకున్నా' - 'ఆటలో గెలుపు, ఓటములు సహజం. గెలవడం కోసం ప్రతీ జట్టు కష్టపడుతోంది. కొన్నిసార్లు గెలిస్తే, మరికొన్ని సార్లు ఓటములు ఎదురవుతాయి. జీవితంలో సమతుల్యత (బ్యాలెన్సింగ్) అనేది ముఖ్యం. ఈ విషయాన్ని నేను రోహిత్ నుంచే నేర్చుకున్నాను. విజయాలు సాధించినా, అపజయాలు ఎదురైనా రోహిత్ వ్యక్తిత్వంలో నేను మార్పు చూడలేదు. అతడు ఒక ఆటగాడిగా, సారథిగా ఎదగడాన్ని నేను దగ్గరుండి చూశాను. నేను అతనితో కలిసి ఆడుతున్నప్పుడు మైదానంలో అతను ఏం చేస్తున్నాడనేది నిశితంగా పరిశీలిస్తాను' అని రోహిత్‌పై సూర్య ప్రశంసలు కురిపించాడు.
విమర్శలు వస్తున్న వేళ - స్వదేశంలో కివీస్‌పై టీమ్ఇండియా వైట్‌వాష్ కావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలిగించి వేరే వారికి బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్‌కు మద్దతుగా సూర్య కుమార్ యాదవ్ మాట్లాడడం గమనార్హం.
'రుతురాజ్‌కు సమయం వస్తుంది' - దక్షిణాఫ్రికా సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు ఎందుకు చోటు దక్కలేదన్న ప్రశ్నకు సూర్య బదులిచ్చాడు. 'రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే అతడి కన్నా ముందు రాణించిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ ఓ విధానాన్ని అనుసరిస్తోంది. ఏదో ఒకరోజు రుతురాజ్ గైక్వాడ్ కు కూడా సమయం వస్తుంది' అని సూర్య చెప్పుకొచ్చాడు.
సూర్య నాయకత్వంలో టీ20 - టీమ్ ఇండియా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం డర్బన్ వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. పొట్టి ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై టీమ్‌ఇండియాదే ఆధిపత్యం అయినప్పటికీ, ఈసారి మాత్రం గట్టి పోటీనిచ్చేందుకు ఆతిథ్య టీమ్ సిద్ధంగా ఉంది.
స్వదేశంలో ఘోర వైఫల్యం! - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఆడుతాడా?
'ఆ టెక్నిక్ ఇక్కడ పనికిరాదు - ఆ విషయంలో రోహిత్ తన వైఖరి మార్చుకోవాలి'