Suresh Raina CSK : ఐపీఎల్ 2020 టోర్నీ ప్రారంభానికి ముందే, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో ఓ కాంట్రవర్సీ నెలకొంది. దుబాయ్‌లో ఆ లీగ్ జరుగుతున్న సమయంలో ఆ జట్టు క్రికెటర్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఉన్నట్టుండి ఇండియాకు వచ్చేశాడు. దీంతో ఆ జట్టు నుంచి అతడు వెళ్లిపోయాడంటూ వార్తలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అప్పట్లోనే చెన్నై ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ స్పందించారు. ధోనీకి ఇచ్చినట్లుగా తనకూ విశాలమైన బాల్కనీ ఉన్న రూమ్‌ను ఇవ్వలేదని దాని వల్ల రైనా అలిగి వెళ్లిపోయాడని తెలిపారు. అయితే అప్పటి ఆ రూమర్స్ గురించి తాజాగా స్పందించాడు రైనా. తన సన్నిహితుల్లో ఒకరు మరణించడం వల్ల పంజాబ్‌కు వెంటనే వెళ్లాల్సి వచ్చిందని, అదే అసలైన కారణమని వివరించాడు.
"పంజాబ్‌లో ఉన్న నా ఫ్యామిలీ చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. మా మావయ్య గొంతు కోసేశారు. నా బ్రదర్‌తో పాటు కజిన్స్‌కు కూడా చాలా గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తు అందులో నా కజిన్ ఒకరు చనిపోయారు. ఇప్పటికీ మా అత్తయ్య లైఫ్ సపోర్ట్‌తో బతుకుతున్నారు." అంటూ ట్వీట్ చేశారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నిందితులెవరో కనుక్కోవాలని ఆ సమయంలో అధికారులను రిక్వెస్ట్ చేశానని వెల్లడించాడు.
ఈ విషయంపై ఆ సమయంలోనే ఎంఎస్ ధోనీకి, టీమ్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చానని, ఆ సమయంలో నా కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులకు నేను ఇండియాకు తిరిగి తప్పక రావాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2020వ సీజన్ తర్వాత రైనా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఐపీఎల్ 2021వ సీజన్‌లోనూ కొనసాగాడు. కానీ, కొద్ది మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, జట్టు అతణ్ని అంటిపెట్టుకోకుండా వేలానికి విడిచిపెట్టేసింది. అక్కడ ఎవరూ కొనుగోలు చేయకపోగా ఐపీఎల్ నుంచి వెళ్లేటప్పుడు కూడా సరైన వీడ్కోలు కూడా అందుకోలేకపోయాడు.
సురేశ్ రైనా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడానికి ముందు టాప్ బ్యాటర్‌లలో ఒకరుగా ఉన్నారు. 205 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ క్రికెటర్ దాదాపు 5,528 పరుగులు చేశాడు. ఇప్పటికీ సీఎస్కేలో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ రైనా మాత్రమే. అంతేకాదు, సీఎస్కేపై నిషేదం విధించిన సమయంలో 2016, 2017 సీజన్లకు గానూ గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్సీ వహించాడు రైనా.
ధోనీ వచ్చే సీజన్లో ఆడుతాడా - రైనా వన్ వర్డ్ ఆన్సర్ ఇదే! - IPL 2025 DHONI