Shakib Al Hasan Murder Case : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు తాజాగా షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదైనట్లు అక్కడి మీడియా కథనాలు తాజాగా వెలువడుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే?
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు జరగ్గా, అందులో రూబెల్ అనే యువకుడు మృతిచెందాడు. దీంతో ఆ అబ్బాయి తండ్రి రఫీకుల్ తాజాగా ఇస్లామ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా గవర్నమెంటే కారణమని ఆరోపించారు.
ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దాని ఆధారంగా షేక్ హసీనాతో పాటు 154 మందిపై మర్డర్ కేసు నమోదు చేశారు. అందులో షకీబ్ అల్ హసన్ పేరు 28వ నిందితుడిగా ఉంది. ఈయనతో పాటు బంగ్లాదేశీ నటుడు ఫెర్దూస్ అహ్మద్ కూడా ఇందులో 55వ నిందితుడిగా నమోదయ్యాడు.
ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందుకే వారి పేర్లు నిండితుల లిస్ట్‌లో ఉంది. అయితే అల్లర్ల కారణంగా హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం వల్ల ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో ఈ ఇద్దరూ తమ పదవిని కోల్పోయారు.
బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హసీనా రాజీనామా తర్వాత నుంచి మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాడు షకీబ్ అల్ అహస్. అయితే కెనడా నుంచి నేరుగా పాకిస్థాన్ వెళ్లిపోయిన షకీబ్ అక్కడ తమ జట్టుతో చేరాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సంబంధించిన కీలక బాధ్యతలు చేపడుతున్నాడు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్, బంగ్లాదేశ్ అల్లర్ల పరిస్థితిపై ఒక్కసారి కూడా స్పందించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. నెట్టింట అతడ్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు "అల్లర్ల కారణంగా జరిగిన మరణాలకు ఓ చట్టసభ్యుడిగా అతడు బాధ్యత వహించాల్సిందే. ఈ విషయంలో అతడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో కూడా స్వదేశానికి వచ్చి తనవంతు వివరణ ఇవ్వాలి" అంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల వేళ ఇప్పుడు అతడిపై హత్య కేసు నమోదవ్వడం కూడా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఫ్యాన్ చెంప చెల్లుమనిపించిన బంగ్లా కెప్టెన్- ఒక్కసారిగా పరుగులు తీసిన అభిమానులు!
అభిమాని మెడ పట్టుకుని ఈడ్చిన స్టార్ క్రికెటర్! - Shakib Al Hasan