Sachin Tendulkar Batting Technique: నేటికీ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా సచిన్ తెందుల్కర్ పేరు చెబుతుంటారు. ప్రస్తుత స్టార్ బ్యాటర్‌లు కూడా సచిన్ బ్యాటింగ్, టెక్నిక్, టైమింగ్ గురించి గొప్పగా మాట్లాడుతారు. అయితే తాజాగా సచిన్ రివర్స్ స్వింగ్‌ను ఎదుర్కోవడంలో తన టెక్నిక్ గురించి వివరించాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించిన చర్చలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ తన కెరీర్‌లో వకార్ యూనిస్, వసీం అక్రమ్, డేల్ స్టెయిన్, జేమ్స్ ఆండర్సన్, ఉమర్ గుల్ వంటి బెస్ట్ రివర్స్ స్వింగ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఈ బౌలర్‌లపై ఆధిపత్యం చెలాయించడానికి రివర్స్ స్వింగ్‌ని ఎలా ప్రాక్టీస్ చేశాడు, ఎలా తన టెక్నిక్‌ని మెరుగుపరచుకున్నాడు? అనే అంశాలపై సచిన్ మాట్లాడాడు.
బంతికి టేప్ చుట్టి
రివర్స్ స్వింగ్ బాగా ఆడేందుకు టెన్నిస్ బాల్‌కు టేప్ చుట్టి దానితో ప్రాక్టీస్ చేసేవాడట. 'నేను ఆడే రోజుల్లో, నేను బంతికి ఒక వైపు టేప్ వేసే వాడిని. లెదర్ బంతుల్లో మేము షైనీ, రఫ్ సైడ్ ఏదని గమనిస్తుంటాం. అందుకే టెన్నిస్ బాల్‌కి ఒక వైపు టేప్ వేసే వాళ్లం. అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం కావడానికి నేను ఈ పద్ధతిలో రివర్స్ స్వింగ్ ప్రాక్టీస్ చేశాను' అన్నాడు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్
జనవరి 26న ప్రారంభం కానున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషించనుంది. లీగ్ ట్రయల్స్ అక్టోబర్‌లో ప్రారంభమవుతాయి. దీంతో రివర్స్ స్వింగ్ ప్రాముఖ్యతను సచిన్ పేర్కొన్నాడు. రాబోయే సీజన్‌లో బ్యాటర్ల మెళుకువలను పరీక్షిస్తానని చెప్పాడు. 'ఈ ఫార్మాట్‌లో రివర్స్ స్వింగ్‌ను ఎందుకు ప్రవేశపెట్టకూడదని నాకు అనిపించింది. ఇది అమలు చేస్తే, ఇది బ్యాటర్ల టెక్నిక్‌లను పరీక్షిస్తుంది. బ్యాటర్లకు కొన్ని ప్రయోజనాలు ఇస్తుంటే, బౌలర్లుకు కూడా పోటీపడే అవకాశం ఉండాలి. తమ ప్రతిభను చూపించే అవకాశం లేని వారికి వేదికను అందించడమే ఐఎస్‌పీఎల్ లక్ష్యం. ఈ టోర్నమెంట్ కొత్త ప్రేక్షకులకు క్రికెట్ మజాని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లకు తమ టాలెంట్‌ని ప్రదర్శించే అవకాశం ఇచ్చింది. లీగ్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. భారత క్రికెట్‌పై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి ఆటగాడికి కలలు కనే అవకాశాన్ని ఇస్తుంది' అని చెప్పాడు.
Legendary cricketer Sachin Tendulkar wowed the crowd with his inspiring speech at the ISPL S2 launch event! 🏏✨ #SachinTendulkar #ISPLSeason2 #Cricket pic.twitter.com/BfyiCxag2z
— Media Buzz India (@media_buzz_in) August 18, 2024
వన్డేల్లో హిట్‌మ్యాన్ వరల్డ్ రికార్డ్ - పదేళ్లైనా ఇంకా చెరగలేదు - Rohit Sharma Birthday