Swapnil Kusale Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత షూటర్ స్వప్నిల్ కుశాలెకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీపై తాజాగా అతడి తండ్రి సురేశ్ కుశాలె కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి కేవలం రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చారని, హరియాణా ప్రభుత్వం వారి అథ్లెట్లకు ఇచ్చిన మొత్తంతో పోలిస్తే చాలా ఇది చాలా తక్కువ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్వప్నిల్‌కు రూ.5 కోట్ల నగదు పురస్కారంతో పాటు పుణెకు చెందిన బలేవాడీలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో ఓ ఫ్లాట్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు.
"మహారాష్ట్ర ప్రభుత్వం తమ కొత్త విధానం ప్రకారం ఒలింపిక్‌లో కాంస్య పతకం గెలిచిన వారికి రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ అందింస్తుంది. 72 ఏళ్లలో రాష్ట్రం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన రెండో వ్యక్తి స్వప్నిల్ రికార్డుకెక్కాడు. అటువంటి పరిస్థితుల్లోనూ ఈ తరహా విధానం ఎందుకు? ఈ క్రీడల్లో హరియాణా నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ఒకరు మాత్రమే పతకాలు సాధించారు. మన రాష్ట్రంతో పోల్చుకుంటే హరియాణా చిన్న రాష్ట్రం కానీ వారు తమ విజేతలకు ప్రైజ్‌మనీ మాత్రం భారీగానే అందించింది. స్టేడియం దగ్గర్లో అతడికి ఫ్లాట్ కేటాయిస్తే ప్రాక్టీస్‌కు వెళ్లడానికి అతడికి ఈజీగా ఉంటుంది. 50 మీటర్లు 3 పొజిషన్స్ రైఫిల్ షూటింగ్ ప్రాంతానికి కూడా స్వప్నిల్ పేరు పెట్టాలి" అంటూ స్వప్నీల్ తండ్రీ తాజాగా డిమాండ్ చేశారు.
ఇక స్వప్నిల్ కెరీర్ విషయానికి వస్తే, తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడిన ఈ మహారాష్ట్ర షూటర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ పతకం గెలిచిన భారత తొలి షూటర్‌గానూ రికార్డుకెక్కాడు. ఫైనల్స్‌లో ఆరంభంలో తడబడినప్పటికీ తిరిగి పుంజుకుని విజయం సాధించాడు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు స్వప్నిల్. 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఒలింపిక్స్‌లో విజయం సాధించిన తర్వాత రైల్వేశాఖ అతడికి ప్రమోషన్ ఇచ్చి సత్కరించింది.
ఒలింపిక్ మెడలిస్ట్ స్వప్నిల్‌కు డబుల్ ప్రమోషన్ - రైల్వే శాఖలో పదోన్నతి - Paris Olympics 2024