స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒకే క్యాలెండర్ ఇయర్లో సొంత గడ్డపై టీమ్ ఇండియా రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. అలాగే 36 ఏళ్ల తర్వాత భారత్‌లో కివీస్ తొలి టెస్టు గెలిచింది. ఇలా ఈ టెస్టు మ్యాచ్ ఓటమితో భారత్ పలు పేలవమైన రికార్డులు నమోదు చేసింది. అలాగే రోహిత్ శర్మ కూడా ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అదేంటంటే?
రోహిత్ కెప్టెన్సీలో మూడు ఓటములు
రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో ఓడిపోయింది. రోహిత్‌తో పాటు ఎంఎస్ ధోనీ, సౌరభ్ గంగూలీ, సచిన్ తెందూల్కర్, బిషన్ సింగ్ బేడీ వంటి దిగ్గజాల కెప్టెన్సీలో కూడా భారత్ మూడు టెస్టుల్లో ఓటమిపాలైంది. అత్యధికంగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఆధ్వర్యంలో భారత్ 9 టెస్టుల్లో ఓటమిచవిచూసింది.
- మన్సూర్ అలీఖాన్ పటౌడీ-9
- మహ్మద్ అజారుద్దీన్- 4
- కపిల్ దేవ్- 4
- రోహిత్ శర్మ-3
- బిషన్ బేడీ-3
- ఎంఎస్ ధోనీ-3
- సౌరభ్ గంగూలీ-3
- సచిన్ తెందూల్కర్ -3
New Zealand win the First Test by 8 wickets in Bengaluru.#TeamIndia will look to bounce back in the Second Test.
— BCCI (@BCCI) October 20, 2024
Scorecard ▶️ https://t.co/8qhNBrs1td#INDvNZ | @idfcfirstbank pic.twitter.com/6Xg4gYo8It
ఒకే క్యాలెండర్ ఇయర్ రెండు ఓటములు
2012లో టీమ్ ఇండియా ఒకే క్యాలెండర్ ఇయర్లో స్వదేశంలో రెండు టెస్టులు ఓడిపోయింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత 2024లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో మొదటి టెస్టులో టీమ్ ఇండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా కివీస్ తో జరిగిన టెస్టులో పరాజయంపాలైంది.
అలాగే స్వదేశీ గడ్డపై ఓడిన మ్యాచ్‌లో సెకండ్ ఇన్సింగ్స్‌లో టీమ్ ఇండియా అత్యధిక స్కోరు చేసింది మాత్రం బెంగళూరులో కివీస్‌తో జరిగిన మ్యాచ్ లోనే. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 462 పరుగులు చేసింది. 2005లో బెంగళూరులో పాకిస్థాన్ పై భారత్ 449 పరుగులు చేసింది. తాజాగా ఆ స్కోరును ఆధిగమించింది.
36ఏళ్ల తర్వాత భారత గడ్డపై కివీస్ విజయం
భారత గడ్డపై ఇప్పటివరకు కివీస్ 37 టెస్టులు ఆడగా, అందులో మూడు గెలిచింది. 1988లో వాంఖడేలో గెలుపు తర్వాత భారత గడ్డపై కివీస్ టెస్టుల్లో విజయం సాధంచలేదు. తాజాగా బెంగళూరు టెస్టులో జయకేతనం ఎగురవేసింది. అంటే 36 ఏళ్ల తర్వాత కివీస్‌కు భారత గడ్డపై విజయం దక్కింది. అలాగే 2000 తర్వాత భారత్ గడ్డపై నాలుగో ఇన్సింగ్స్‌లో విదేశీ జట్టు 100పరుగుల కన్నా ఎక్కువ లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఆ రికార్డును తాజా విజయంతో కివీస్ బద్దలుకొట్టింది.
కివీస్- భారత్ తొలి టెస్టు స్కోరు వివరాలు :
- భారత్ తొలి ఇన్నింగ్స్: 46 ఆలౌట్
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 పరుగులు
- భారత్ రెండో ఇన్నింగ్స్: 462 పరుగులు
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 110/2