Pant Dhoni Comparison : చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ(109)తో అదరగొట్టాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే శతకం బాదాడు.
'ధోనీతో పోల్చొద్దు'
కాగా, పంత్ కెరీర్లో ఇది ఆరో టెస్టు సెంచరీ. ఈ క్రమంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ సమం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఆరు శతకాలు బాదితే, పంత్ 34 టెస్టుల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే బంగ్లాతో టెస్టు విజయం అనంతరం పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ఎంఎస్ ధోనీతో పోల్చొద్దని తెలిపాడు. ప్రతి గేమ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించడమే తన తొలి ప్రాధాన్యత అని అన్నాడు.
'చెపాక్ స్టేడియం చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్. మహీ భాయ్ ఇక్కడ చాలా క్రికెట్ ఆడాడు. ఇంతకుముందు చాలాసార్లు నేనొక విషయం చెప్పాను. ధోనీతో నన్ను పోల్చొద్దు. నన్ను నాలానే ఆడనివ్వండి. నా చుట్టూ జరిగే ప్రచారాల గురించి నేను పట్టించుకోను. నా ఆటపై ఫోకస్ చేస్తూ, అత్యుత్తమ క్రికెట్ ఆడడమే నా లక్ష్యం. ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. బంగ్లా 3వ రోజు ఆటను స్పిన్నర్లతో ప్రారంభించి. కానీ, నేను ముందుగానే మూడోరోజు ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నాను. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని శతకం బాదాను. మేం లంచ్‌కు వెళ్లినప్పుడు డిక్లేర్ గురించి చర్చ జరిగింది. రోహిత్ మాకు బ్రేక్ తర్వాత ఒక గంట సమయం ఇస్తానని చెప్పారు' అని విజయం అనంతరం పంత్ వ్యాఖ్యానించాడు.
The Rishabh Pant heritage! 🫡
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2024
- A Test century by Pant returning after 634 days. 🤯pic.twitter.com/V8bQ3y7RCf
అశ్విన్ అదుర్స్
మరోవైపు, అశ్విన్ సైతం బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి ఇన్సింగ్స్‌లో శతకం బాదగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. దీంతో అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని పోల్చుతూ తనకు ఏది ఎక్కువ ముఖ్యమో చెప్పాడు.
'బౌలింగ్‌కే నా ఓటు'
తనకు తొలి ప్రాధాన్యత బౌలింగేనని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అందుకే వికెట్లు తీయడం తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. అయితే బ్యాటింగ్ కూడా ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. 'ఈ టెస్టులో తొలి రోజు నాకు చాలా ప్రత్యేకమైంది. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టినందుకు ఆనందంగా ఉంది. నేను ఎక్కువగా బౌలర్లా ఆలోచిస్తాను. కానీ, బ్యాటింగ్‌కు దిగేటప్పుడు బ్యాటర్లా ఆలోచిస్తాను. కొన్నేళ్లుగా రెండింటిని మేనేజ్ చేస్తున్నా' అని అశ్విన్ పేర్కొన్నాడు.
637 రోజుల తర్వాత పంత్ టెస్ట్ సెంచరీ - గిల్ కూడా అదిరే శతకం - Panth Gill Century