Teamindia RohithSharma : టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా విజయఢంకా మోగించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టి ట్రోఫీని ముద్దాడింది. అనంతరం స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ ఇండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత రోహిత్ సేన ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా సమావేశమైంది. అక్కడ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించిన ప్రధాని టోర్నీ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. సరదాగా వారిని ప్రశ్నిస్తూ ఉత్సాహం నింపారు. దానికి సంబంధించిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది.
ఇందులో మోదీ ఫైనల్ మ్యాచ్ రోజు తాను గమనించిన అంశాలను టీమ్‌తో షేర్ చేసుకున్నారు. వైరల్‌గా మారిన రోహిత్ మూమెంట్స్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మోదీ ఫైనల్ డే గురించి చెబుతూ, ‘సాధారణంగా, నేను లేట్ నైట్ వరకు వర్క్ చేస్తాను. కానీ ఆ రోజు (ఫైనల్ మ్యాచ్ రోజు) టీవీ ఆన్‌లో ఉంది. ఫైల్స్ కూడా చూస్తున్నాను. కాబట్టి కాన్సన్‌ట్రేట్ చేయడం కాస్త కష్టమే. మీరు గొప్ప టీమ్ స్పిరిట్, ట్యాలెంట్ కనబరిచారు. మీ పేషన్స్, కాన్ఫిడెన్స్‌ని గమనించాను. అద్భుత విజయం సాధించినందుకు అందరినీ అభినందిస్తున్నాను.’ అన్నాడు.
ఆ రహస్యం ఏంటి? - మోదీ రోహిత్‌ని, ‘దేశంలోని ప్రతి ఒక్కరూ గమనించే ఉంటారు. కానీ రోహిత్, నేను రెండు విభిన్న అంశాలు చూశాను. మ్యాచ్ గెలిచిన వెంటనే మీ ఎమోషన్స్(పిచ్‌పై మట్టి తినడం) చూశాం. ట్రోఫీ అందుకోవడానికి వెళ్తూ చేసిన డ్యాన్స్ గమనించాం. దీని వెనక రహస్యం ఏంటి’ అని అడిగారు.
రోహిత్ సమాధానమిస్తూ, ‘సర్, ఇది మేము చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు. కాబట్టి నా టీమ్ మేట్స్ ట్రోఫీ తీసుకునేటప్పుడు సాధారణంగా వెళ్లొద్దు. ఏదైనా డిఫరెంట్‌గా చెయ్యి అని చెప్పారు.’ అన్నాడు. వెంటనే మోదీ ఫన్నీగా, ఇది చాహల్ ఐడియా అయి ఉంటుంది అన్నారు. చాహల్, కుల్దీప్ ఇద్దరూ చెప్పారని రోహిత్ చెప్పాడు.
అందుకే తిన్నాను - పిచ్‌పై మట్టిని తీసుకోవడం గురించి కెప్టెన్ మాట్లాడుతూ, ‘ఆ పిచ్‌పై ఆడి ట్రోఫీని గెలుచుకున్నందుకు ఆ మట్టిని రుచి చూడాలని, ఆ అంతుచిక్కని విజయాన్ని అందుకున్న సందర్భాన్ని గుర్తుంచుకోవాలని అనుకున్నాను. మేము చాలా కాలంగా వరల్డ్ కప్ గెలవడానికి కష్టపడ్డాం. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలవడానికి దగ్గరగా వచ్చాం. కానీ చివరి అడుగు వేయలేకపోయాం. కానీ ఈసారి, మొత్తం టీమ్ వర్క్ ఫలించింది. ఆ పిచ్‌పై మేం ఆడినందుకు దానికీ ప్రాముఖ్యత ఉంది. నేను ఏదైనా చేయాలనుకున్నాను. ఆ సమయంలో ఆకస్మికంగా అలా చేశాను.’ అని చెప్పాడు.
మోదీతో జ్ఞాపకాలు షేర్ చేసుకున్న ప్లేయర్స్
హార్దిక్ పాండ్యా గత ఆరు నెలల్లో ఎదుర్కొన్న విమర్శలపై మాట్లాడుతూ, ‘గత ఆరు నెలల్లో చాలా కష్టపడ్డాను. మాటలతో కాకుండా పనితీరుతో సమాధానం చెప్పాలనుకున్నాను. నేను అప్పుడు నోరు మెదపలేకపోయాను. ఇప్పుడు నోరు మెదపలేను. చాలా కష్టపడి వరల్డ్ కప్‌కు సిద్ధమయ్యాను. అదృష్టం కూడా నా వెంట ఉంది.’ అన్నాడు.
సూర్యకుమార్ తన అద్భుతమైన క్యాచ్ గురించి చెబుతూ, ‘నేను అలాంటి క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాను. అందుకే ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్నాను’ అని చెప్పాడు.
ప్రధాని కుల్దీప్‌ను ఉద్దేశించి ఫన్నీగా, ‘మేము మిమ్మల్ని కుల్దీప్ అని పిలవాలా, దేశ్‌దీప్ అని పిలవాలా’ అనడిగారు. కుల్దీప్, ‘నేను దేశానికి చెందినవాడిని’ అని సమాధానమిచ్చాడు. ‘మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం నా పాత్ర. అదే నేను చేయాలనుకున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మూడు ప్రపంచ కప్‌లు ఆడాను. ట్రోఫీని గెలవడం నా జీవితంలో మరపురాని క్షణాలు’ అని కుల్దీప్ చెప్పాడు.
అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, తన సీనియర్ సహచరుడు జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించాడు. బుమ్రా ఖచ్చితత్వం, ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టడాన్ని కొనియాడాడు ‘ఇద్దరం టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన (17) బౌలర్లుగా నిలవడం ఆనందంగా ఉంది.’ అని అర్ష్‌దీప్ సింగ్ అన్నాడు.
'ఆ రోజు నమ్మకం లేదని రోహిత్‌తో అన్నాను' - మోదీ ప్రశ్నకు కోహ్లీ ఆన్సర్ - Kohli Modi