Paris Paralympics Silver Medalist Manish Narwal : మనీశ్ నర్వాల్ ఈ పేరు ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో గట్టిగానే వినపడుతోంది. ఎందుకంటే టోక్యో పారాలింపిక్స్‌లో పసిడితో సత్తా చాటిన అతడు ఇప్పుడు పారిస్‌లోనూ రజతంతో అదరగొట్టాడు. అయితే ఈ 22 ఏళ్ల కుర్రాడి కెరీర్ జర్నీ ఎంతో మందికి ఆదర్శం.
అన్నయ్య దూరంతో ఆరు నెలలు బాధలోనే - చిన్నప్పుడు నుంచి చేయి పట్టుకుని నడిపించిన అన్నయ్య ఒక్క సారిగా మనల్ని వదిలి దూరమైతే, ఎప్పుడు తోడుగా ఉంటూ ప్రోత్సహించిన ఆ అన్నయ్య ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే, తమ్ముడికి మనసులో కలిగే కష్టం, బాధ ఊహించడం కష్టం.
టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మనీశ్ నర్వాల్ జీవితంలో ఇదే జరిగింది. అతడు ఈ పసిడి సాధించిన తర్వాతి ఏడాదే ఈ విషాద ఘటన అతడి జీవితంలో చోటు చేసుకుంది. అప్పటి వరకు తన తోడుగా ఉంటూ, ప్రోత్సాహిస్తూ ఉన్న అన్నయ్య మంజీత్ సింగ్ 2022లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో మనీశ్ ఎంతగానో కుంగిపోయాడు.
ఆరు నెలల పాటు ఆ బాధలో నుంచి రాలేక తుపాకీ కూడా పట్టుకోలేదు. ఆ తర్వాత పారిస్ పారాలింపిక్స్‌లో మరో మెడల్ గెలిచి తన అన్నయ్యకు ఘన నివాళి సమర్పించాలనుకున్నాడు. ఆ లక్ష్యంతో మళ్లీ ప్రాక్టీస్‌పై బలంగా దృష్టి పెట్టాడు. ఇప్పుడు పారిస్‌లో సిల్వర్ మెడల్ సాధించి అనుకున్నది సాధించాడు.
🇮🇳 A Moment of Pride for India! 🥈
— Paralympic Committee of India (@PCI_IN_Official) August 30, 2024
Manish Narwal's incredible silver medal win is a testament to his dedication and India's prowess on the global stage. Let's celebrate this moment of pride together!#Cheer4Bharat #MachaDhoom #SilverMedal #Paris2024 #ProudMoment @OfficialNRAI… pic.twitter.com/0QZlbNnXDl
ఆ ఇద్దరు దిగ్గజాలంటే అభిమానం - మనీశ్‌ది హరియాణా. అతడు పుట్టిన వెంటనే చికిత్సలో ఏదో లోపం జరిగింది. దీంతో అతడి కుడి భుజం నరాలు దెబ్బతిని చేయి పని చేయలేదు. మనీశ్‌కు చికిత్స అందించడం కోసం అతడి తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో క్రమక్రమంగా మనీశ్ తన వైకల్యాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. ఇక చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాడు. అతడికి దిగ్గజ స్ప్రింటర్ బోల్ట్, ఫుట్‌బాల్ స్టార్ మెస్సిలు అంటే ఎంతో అభిమానం. అందుకే అతడు మొదట ఫుట్‌బాల్‌ను ఇష్టపడి అందులో రాణించాలనుకున్నాడు.
రక్తం వచ్చినా నొప్పి తెలియలేదు - అయితే ఒకసారి మనీశ్ ఆడుతుంటే అతడి కుడి చేతికి గాయమైంది. రక్తం కూడా వచ్చింది. కానీ అతడికి నొప్పే తెలియ లేదు. అలానే ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక అతడి తల్లిదండ్రులు ఆ గాయాన్ని గుర్తించారు. అప్పుడే అతడు ఫుట్ బాల్‌కు దూరమైపోయాడు. అయితే ఆటల్లో మనీశ్ ఆసక్తిని అతడి తండ్రి గమనించాడు. మనీశ్ షూటింగ్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. అక్కడు తుపాకీపై ఇష్టాన్ని పెంచుకున్నాడు మనీశ్.
మనీశ్‌కు కుడి చేతితో పట్టుకునే గ్రిప్ ఉన్న పిస్టల్‌తోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ అతడు ఎడమ చేతితో దాన్ని పట్టుకుని, సమర్థంగా ఉపయోగించి పట్టు సాధించాడు. దీంతో మనీశ్‌కు పిస్టల్ కొనివ్వడం కోసం అతడి తండ్రి ఇంటిని కూడా అమ్మేశాడు.
ఘనంగా అంతర్జాతీయ కెరీర్ మొదలు - అనంతరం మనీశ్ తన సాధనను మెరుగుపరుచుకున్నాడు. 2017లో బ్యాంకాక్ వరల్డ్ కప్‌లో జూనియర్ ప్రపంచ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించాడు. 2018 ఆసియా పారా క్రీడల్లో 10మీ.పిస్టల్‌లో గోల్డ్ మెడల్, 50మీ.పిస్టల్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో అతడి పేరు మార్మోగింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్ సాధించాడు.
ఈ క్రమంలోనే టోక్యో పారాలింపిక్స్ మిక్స్‌డ్ 50మీ.పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన అన్న మరణాన్ని దాటి ఇప్పుడు పారిస్‌లోనూ పసిడిని ముద్దాడాడు. ఇకపోతే మనీశ్ ఓ తమ్ముడు, సోదరి ఉన్నారు. తమ్ముడు శివ నర్వాల్ ఆసియా క్రీడల్లో పురుషుల 10మీ.ఎయిర్ పిస్టల్ ఛాంపియన్‌గా అవతరించాడు. సోదరి శిఖా కూడా సోదరుల బాటలోనే ఆటలో కొనసాగుతోంది.
పారాలింపిక్స్‌లో భారత్ బోణీ - ఒకేరోజు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ - Paralympics India 2024