Paris Paralympics 2024 Preeti Pal Bronze Medal : పిల్లలు వైకల్యంతో పుడితే ఏ తల్లి దండ్రులకైనా ఎంతో బాధ ఉంటుంది. అందరి పిల్లలా ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపలేకపోతే ఆ బిడ్డతో పాటు, అమ్మ నాన్న పడే వేదన వర్ణణాతీతం. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రీతి పాల్, ఆమె కుటుంబ సభ్యులు ఇదే మనో వేదనను తట్టుకుని నిలబడ్డారు. దీంతో ఇప్పుడు ప్రీతి పాల్ దేశం గర్వించద్దగ స్థాయికి ఎదిగింది. పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని తెచ్చిపెట్టింది.
చిరుతలా పరుగెత్తి! - పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల టీ - 35 100 మీటర్ల పరుగు విభాగంలో పోటీ మొదలైంది. అప్పుడు ఈ బరిలోకి అథ్లెటిక్స్‌లో భారత పతక ఆశలు మోస్తూ ప్రీతి పాల్ దిగింది. గన్ సౌండ్ వినపడగానే చిరుతలా పరుగెత్తింది! అలా ఈ 23 ఏళ్ల ప్రీతి 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానాన్ని అందుకుంది. పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి పతకం అందించింది. పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. ఇక ఇదే ఈవెంట్లో చైనా అథ్లెట్లు జౌ జియా(13.58 సె), గువా కియాంక్వియాన్ (13.74 సె) గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలిచారు.
బలహీనత, వంకర కాళ్లు - ప్రీతి పాల్ బలహీన, వంకర కాళ్లతో జన్మించింది. దీంతో చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆమె కాళ్లలో బలం పెంచి సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్యులు చాలానే ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. కొన్నేళ్లు కాలిపర్స్ కూడా ధరించి ప్రయత్నించినా మాములు స్థితికి రాలేకపోయింది.
🌟 In the grand stage of the Paris Paralympics Finals, Preeti Pal delivered an outstanding performance, claiming 3rd place in the Women’s 100m T35 with a new personal best! 🥉
— Paralympic Committee of India (@PCI_IN_Official) August 30, 2024
An inspiring achievement on the world stage, proving that hard work and determination know no limits.… pic.twitter.com/4zBbzVeR9K
అలా జీవితం మలుపు - చివరికి ప్రీతి పాల్ వైకల్యానికి అలవాటు పడిపోయి జీవినం కొనసాగించింది. అయితే తన 17 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో పారాలింపిక్ క్రీడల్ని చూసింది. అవి ఆమెలో కొత్త ఆశలు రేపాయి. కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాలే ప్రేరేపించాయి. అదే సమయంలో పారా అథ్లెట్ ఫాతిమా ఖాతూన్‌ను ప్రీతి పాల్ కలవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
దీంతో ప్రీతి పాల్ పరుగులో శిక్షణ తీసుకుని పారా అథ్లెట్‌గా మారింది. ఆ తర్వాతి ఏడాదే స్టేట్, నేషనల్ పోటీల్లో పాల్గొంది. 100 మీ, 200 మీ పరుగులో నేషనల్ బెస్ట్ అథ్లెట్‌గా ఎదిగింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ, 100 మీ, 200 మీ విభాగాల్లో బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లోనూ పోటీ పడ్డ మొదటి సారే కాంస్య సాధించింది. 100 మీ విభాగంలో ఈ పతకాన్ని దక్కించుకుంది. ఇప్పుడామె ఆమె 200 మీ విభాగంలోనూ పోటీ పడనుంది.