Paralympics 2024 Praveen Kumar Gold Medal : పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వైకల్యాలను అధిగమించి మరీ పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హై జంప్ టీ64 ఈవెంట్లో ప్రవీణ్ కుమార్ అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నాడు. టీ 64 హై జంప్ పోటీల్లో 2.08 మీటర్ల ఎత్తు జంప్ చేసి స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హై జంప్ రికార్డ్. ఈ మెడల్‌తో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
అతిచిన్న వయసులోనే రికార్డ్ - 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లోనూ ప్రవీణ్ సిల్వర్ మెడల్ సాధించాడు. తద్వారా అప్పుడు అతడు అతి చిన్న వయసులోనే ఒలింపిక్ మెడల్ సాధించిన పారా అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. ఇంకా ప్రస్తుత పారాలింపిక్స్‌లో మెడల్ అందుకోవడంతో, ప్రవీణ్ పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకాన్ని సాధించినట్టైంది.
అలానే హైజంప్‌లో భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన రెండో ఆటగాడు కూడా ప్రవీణే. అంతకుముందు మరియప్పన్ తంగవేలు ఈ హైజంప్‌లో స్వర్ణాన్ని ముద్దాడాడు. ఇంకా పారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో హైజంపర్‌గానూ నిలిచాడు. ఇకపోతే ఈ పారిస్ పారాలింపిక్స్‌లో ఇప్పటికే హైజంప్ టీ-63 ఈవెంట్లో శరద్ కుమార్ సిల్వర్(1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్ బ్రాంజ్(1.85 మీటర్లు) మెడల్‌ను దక్కించుకున్నారు.
Play. PRA(WIN). Progress✅🫡
— SAI Media (@Media_SAI) September 6, 2024
What an extraordinary performance from Para High Jumper Praveen Kumar!
He upgrades his #Tokyo2020 Silver to Gold with a tremendous Personal Best leap of 2.08m and boosts #TeamIndia’s rankings in the #ParisParalympics2024 medals tally.
Savour… pic.twitter.com/yJ9VQdSZio
అసలు ఎవరీ ప్రవీణ్ కుమార్ - ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21ఏళ్ల అథ్లెట్ ప్రవీణ్ కుమార్. ఇతడికి పుట్టుకతోనే కాలి వైకల్యం ఉంది. ఓ కాలు చిన్నగా ఉండటం వల్ల చిన్నప్పుడు ఆత్మన్యూనతా భావంతో గడిపేవాడు ప్రవీణ్. అయితే ఆ బాధను అధిగమించడానికి క్రీడల వైపు ఆసక్తిని మళ్లించాడు. మొదట వాలీబాల్‌పై ఆసక్తిని పెంచుకుని దానినే ఎక్కువగా ఆడేవాడు. కానీ ఆ తర్వాత ఓ పారా అథ్లెటిక్స్ కోచ్ అతడి సామర్థ్యాన్ని గుర్తించి హైజంప్‌లో పోటీ పడేలా ప్రోత్సహించాడు. అప్పటి నుంచి ప్రవీణ్ కెరీర్ మలుపు తిరిగింది.
2019లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ప్రవీణ్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 2021లో దుబాయ్ వేదికగా జరిగిన గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ ఈవెంట్‌లోనూ గోల్డ్ మెడల్‌ను సాధించాడు. అదే ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లోనూ సిల్వర్ మెడల్‌ను దక్కించుకున్నాడు. 2022లో ఏషియన్ పారా గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు 2.05 మీటర్లతో ఆసియా రికార్డును క్రియేట్ చేశాడు.
పారాలింపిక్స్ 2024 - హైజంప్‌లో భారత్‌కు స్వర్ణం
ఇండియా క్రికెట్ 'కుబేరుడు' ఇతడే - సచిన్, విరాట్ కాదు! - Indias Richest Cricketer