Paris Olympics 2024 Gift Box : గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో పారిస్ ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నాయి. అయితే ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచినవారికి మెడల్‌తో పాటు ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తున్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి అందులో ఏముంది? దాని విశిష్టత ఏంటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శనివారం ఫ్రాన్స్, ఫిజీ మధ్య జరిగిన రగ్బీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రాన్స్ విజయం సాధించింది. ఫిజీని ఫైనల్లో ఓడించడం వల్ల ఫ్రాన్స్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అప్పుడు ఫ్రాన్స్ రగ్బీ టీమ్ కెప్టెన్ ఆంటోయిన్ డుపాంట్, తన సహచరులతో కలిసి గిఫ్ట్ బాక్సును పట్టుకున్నారు. అలాగే వెండి, కాంస్య పతక విజేత జట్లకు కూడా గిఫ్ట్ బాక్సులను అందజేశారు. అప్పుడు వీక్షకుల దృష్టిలో ఈ గిఫ్ట్ బాక్సు పడింది. దీంతో అందులో ఏముంటందని నెట్టింట్లో అందరు తెగ సెర్చ్ చేస్తున్నారు.
మెడల్‌తో పాటు గిఫ్ట్ బాక్స్ - ఒలింపిక్స్‌లో గెలుపొందిన వారికి మెడల్‌తో పాటు ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తారు. అందులో ఒలింపిక్స్‌కు సంబంధించిన అధికారక పోస్టర్‌ను ఉంచుతారు. బంగారం, రజతం, కాంస్యం ఇలా ఏ పతక విజేతలకైనా ఈ గిఫ్ట్ బాక్సును ఇస్తారట. ఈ ఒలింపిక్ పోస్టర్‌ను పారిస్ చిత్రకారుడు ఉగో గట్టోని డిజైన్ చేశారు. ఈ పోస్టర్ రూపకల్పనకు ఆయనకు దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందట. ఈ పోస్టర్‌ను ఈ ఏడాది మార్చి 24న పారిస్‌లోని మ్యూసీ డి ఓర్సే మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ నగర విశిష్టత తెలియజేసేలా తీర్చిదిద్దారు. అలాగే పోస్టర్లో ఈఫిల్ టవర్, సీన్ రివర్ వంటి ఫ్రెంట్ స్మారక చిహ్నాలు ఉంటాయి. అలాగే ఈ పోస్టర్‌ను ఆన్ లైన్లోనూ కొనుగోలు చేయవచ్చు.
మస్కట్ ఇదే - ఒలింపిక్స్ పేరు వినగానే చాలా మందికి ఐదు రింగుల చిహ్నమే గుర్తొస్తుంది. దీంతో పాటే ఓ ముద్దొచ్చే మస్కట్ కూడా మరికొంతమందికి గుర్తొస్తుంది. అయితే ఈ సారి పారిస్ ఒలింపిక్స్ 2024లో పెద్ద పెద్ద నీలి కళ్లతో ఉన్న ఫ్రీజ్ అనే మస్కట్ దర్శనమిస్తోంది. ఫ్రెంచి సంప్రదాయంలో కీలకమైన ఫ్రీజియన్ క్యాప్ ఆధారంగా దీనిని రూపొందించారు. అలాగే విజేతలకు అందించిన మెడల్స్ వెనుక ఫ్రెంచ్ భాషలో బ్రావో అని రాసి ఉంటుంది.