Paris Olympics 2024 javelin gold winner Arshad Nadeem career : ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడిని ముద్దాడుతాడని భావిస్తే ఆ గోల్డ్ మెడల్‌ను పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఎగరేసుకుపోయాడు. ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఇదో సెన్సేషనల్ రికార్డ్. 40 ఏళ్లుగా పాక్ దేశం ఎదురుచూస్తున్న ఒలింపిక్ పసిడిని అందించాడు. దీంతో అర్షద్ ఎవరా? అని క్రీడాభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అతడి గురించే ఈ కథనం.
పేద కుటంబం, తిండి కూడా లేకుండా - అర్షద్ నదీమ్ మియా చాను దగ్గర్లోని ఖనేవాల్ అనే గ్రామంలో జన్మించాడు. 1997 జనవరి 2న జన్మించాడు. ఇతడిది పేద కుటుంబం. ఇతడి తండ్రి మహమ్మద్ అష్రాఫ్ కూలి. ఈయనకు మొత్తం ఏడుగురు సంతానం. వీరిలో నదీమ్ మూడోవాడు.
అయితే నదీమ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అతడికి అవసరమైన డైట్ కూడా దొరికేది కాదట. కేవలం ఈద్ అల్ అదా నాడు మాత్రమే వారి కుటుంబం మాంసాహారం తినేదట. అంటే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే. ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉండేదట.
కోచ్ గుర్తించడంతో అథ్లెటిక్స్‌లోకి - నదీమ్ చిన్నప్పటి నుంచి గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. స్కూల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి బాగా ఆడేవాడు. క్రికెట్‌లో అయితే జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు ఆడాడు. మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే వాటన్నింటిని మించి అథ్లెటిక్స్‌లో బాగా రాణించాడు నదీమ్. దీన్ని కోచ్ రషీద్ అహ్మద్ సాకీ గుర్తించాడు. దీంతో అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు.
గోల్డ్ మెడల్స్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు - అయితే నదీమ్ జావెలిన్ త్రో కన్నా ముందు షాట్‌పుట్, డిస్కస్ త్రోను ట్రై చేశాడు. కానీ ఆ తర్వాత జావెలిన్‌త్రోలో మంచిగా రాణించడం ప్రారంభించాడు. ఈ జావెలిన్ త్రోలో పంజాబ్ యూత్ ఫెస్టివల్స్, ఇంటర్ బోర్డ్ మీట్‌లో వరుసగా గోల్డ్ మెడల్స్‌ను సాధించాడు. దీంతో జాతీయ స్థాయిలో అతడికి గుర్తింపు వచ్చింది. ఆర్మీ, డబ్ల్యూపీడీఏ, ఎయిర్‌ఫోర్స్ నుంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆర్మి ఆఫర్‌ను నదీమ్ సోదరుడు తిరస్కరించాడు. జావెలిన్ త్రోను లక్ష్యంగా ఎంచుకోవడంలో అతనికి తండ్రి కూడా ఎంతో సాయం చేశాడట.
అలా మొదలైన జావెలిన్ కెరీర్ - నదీమ్ తన జావెలిన్ కెరీర్‌ను 2015లో ప్రారంభించాడు. ఆ తర్వాతి ఏడాదే వరల్డ్ అథ్లెటిక్స్ తరఫున స్కాలర్ షిప్ సంపాదించాడు. అయినా అతడి కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో సార్లు గాయాల బారిన పడ్డాడు. సొంత దేశం అయి కూడా పాకిస్థాన్ అతడికి స్కాలర్‌షిప్ ఇవ్వలేకపోయింది.
నదీమ్ వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే గ్రామంలోని వారు చందాలు వేసుకొని అతడికి డబ్బులు ఇచ్చేవారు. ఇక నదీమ్ డైట్ విషయంలో అతడి అంకుల్ సాయం చేసేవారట. అప్పట్లో 2016లో నదీమ్ - నీరజ్ మొదటి సారి సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పోటీ పడ్డారు. ఈ పోటీల్లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించగా నదీమ్ కాంస్యం దక్కించుకున్నాడు.
ARSHAD NADEEM 🇵🇰 SETS A NEW OLYMPIC RECORD IN THE MEN'S JAVELIN! 😱 pic.twitter.com/gnbAOKXQK5
— The Olympic Games (@Olympics) August 8, 2024
27 ఏళ్ల నాటి తుప్పు పరికరాలతో - నదీమ్ ఫిట్నెస్ కోసం పాక్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం దగ్గరున్న ఓ పురాతనమైన జిమ్‌లో చేసేవాడట. అందులో ఉన్న పరికరాలన్నీ పాతవే. 27ఏళ్ల నాటివి అంట. పూర్తిగా తుప్పు పట్టిపోయి ఉంటాయట.
ఈ ఏడాది అన్నీ కష్టాలే - 2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో నదీమ్ తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటి త్రో వేశాడు. ఈ త్రోతో గోల్డ్ మెడల్‌ను సాధించాడు. దీంతో ఈ సారి అతడు ఒలింపిక్స్ పతకం సాధిస్తాడని అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అయితే ఒలింపిక్స్ సమయం దగ్గర పడే కొద్దీ నదీమ్‌ను కష్టాల సుడిగుండాలు చుట్టుముట్టాయి. దీంతో గతేడాది ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒలింపిక్ శిక్షణను ప్రారంభించాడు. కానీ, గాయపడటం వల్ల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో రెండు నెలలు విశ్రాంతిలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా మరో చిన్న గాయం అయింది. దీంతో మరి కొంతకాలం పాటు ఆటకు దూరమయ్యాడు. అయితే ఆ సమయంలో జావెలిన్ టెక్నిక్స్‌ను అధ్యయనం చేశాడు నదీమ్.
అలానే ఈ ఒలింపిక్స్ దగ్గర పడేకొద్దీ నదీమ్ దగ్గరున్న 2015 నాటి జావెలిన్ త్రో బల్లెం పాడైపోయింది. దీంతో వాళ్ల కోచ్ కొత్తది సమకూర్చాడు. అప్పట్లో ఈ విషయమై నీరజ్ చోప్రా కూడా పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఏదేమైనా అంత దుర్భర స్థాయి నుంచి ఇప్పుడు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించి ప్రశంసలను అందుకుంటున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్ కూడా నదీమ్‌కు రూ.5 కోట్లు నజరానాను ప్రకటించింది.
బంగారుకొండకు వెండి దండ - నీరజ్ చోప్రా సెన్సేషనల్ రికార్డ్ - PARIS OLYMPICS 2024