Annu Rani ETV Bharat Exclusive: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఉమెన్స్ జావెలిన్ త్రోలో భారత్ పతకం గెలుస్తుందని ఆశిస్తున్నారు. గతేడాది ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన అన్నూ రాణి, ఇప్పుడు ఒలింపిక్స్ బరిలో నిలిచింది. ఆసియా క్రీడల తర్వాత అన్నూ రాణి స్టార్‌గా మారింది. ఈ స్థాయికి రావడానికి ఆమె చాలా కష్టపడింది. ఆమె ఒకప్పుడు జావెలిన్ కూడా కొనుగోలు చేయలేక వెదుదు కర్రలు, చెరకు గడలతో ప్రాక్టీస్ చేసింది. ఇంకా చెప్పాలంటే అన్నూ రాణి పల్లె నుంచి పారిస్ వరకు ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే తాజాగా అన్నూ రాణి కుటుంబ సభ్యులను ఈటీవీ భారత్ పలకరించింది. వారు ఆమె ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదలను వివరించారు. పారిస్‌లో అన్నూ బంగారు పతకం గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు.
ప్రారంభ జీవితం మరియు పోరాటాలు
అన్నూ రాణి ఉత్తరప్రదేశ్‌లోని బహదూర్‌పూర్‌లో జన్మించింది. అమర్‌పాల్ సింగ్, మున్నీ దేవి తల్లిదండ్రులు. వారిది వ్యవసాయ కుటుంబం. పెద్దయ్యాక అన్నూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కొత్త జావెలిన్ కొనడానికి డబ్బు లేక, వెదురు కర్రలతో లేదా చెరకు గడలతో త్రో ప్రాక్టీస్ చేసేదని ఆమె తల్లి మున్నీ దేవి చెప్పారు. మొదట్లో, అన్నూ క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని తండ్రి అమర్‌పాల్ వ్యతిరేకించారు. అయితే ఆమె ప్యాషన్, సంకల్పం అర్థం చేసుకున్న తర్వాత, ఆమెకు పూర్తిగా మద్దతుగా నిలిచారు. ఇప్పుడు తన కూతురి వల్లే ప్రజలు తనను గుర్తిస్తున్నారని సగర్వంగా చెప్పారు.
జావెలిన్ వైపు ఎలా వచ్చింది?
అన్నూకి ముందు షార్ట్‌పుట్ లేదా డిస్కస్ త్రోపై ఆసక్తి ఉండేదని ఆమె సోదరుడు ఉపేంద్ర తెలిపారు. వాటిపై ఆసక్తితోనే క్రీడల్లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె కోచ్ జావెలిన్ త్రోలో ఆమె సామర్థ్యాన్ని చూసి, దానిపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. అలా అతని సలహాతో, జావెలిన్ త్రోలో పట్టు సాధించేందుకు ప్రయత్నించింది అన్నూ. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించి త్వరగానే పేరు తెచ్చుకుంది.
గతంలో ఉత్తరప్రదేశ్, హరియాణాలోని పశ్చిమ ప్రాంతాలకు చెందిన బాలికలు ఇళ్లకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు అన్నూ తెల్లవారుఝామున 4 గంటలకు రన్నింగ్ వెళ్లి, సూర్యుడు వచ్చేలోపు ఇంటికి తిరిగి వచ్చేసేది. ఎందుకంటే గ్రామంలోని అమ్మాయిలు ఎవ్వరూ లో స్కర్టులు ధరించరు. ఆడ పిల్లలు ఎవ్వరూ క్రీడలు ఆడరు. అయితే ఇప్పుడు తన విజయాలతో ఇప్పుడు అన్నూ రాణి ఎందరో వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా మారింది.
సోదరుడికి రాఖీ పంపిన అన్నూ
బిజీ షెడ్యూల్‌లో కూడా అన్నూ రక్షా బంధన్ గుర్తు పెట్టుకుందని, కొరియర్ ద్వారా తనకు రాఖీ పంపుతుందని సోదరుడు ఉపేంద్ర చెప్పాడు.
7న జావెలిన్ త్రో క్వాలిఫైయర్స్
అన్నూ రాణి ఆగస్టు 7న ఒలింపిక్స్‌లో పోటీ పడనుంది. మహిళల జావెలిన్ త్రో క్వాలిఫైయర్స్ మధ్యాహ్నం 1:55 గంటలకు ప్రారంభమవుతాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంట్రవర్సీ- ఆ అథ్లెట్ ఎంపికపై IOC ఫైర్ - Paris Olympics 2024