Paris olympics 2024 vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తుది పోరుకు చేరిన తర్వాత 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు శారు. అయితే ఈ నిర్ణయాన్ని క్రీడాభిమానులతో పాటు ఇతర దేశాల రెజ్లర్లు కూడా వ్యతిరేకించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇక నుంచి రెజ్లర్ల బరువు కొలిచే రూల్స్‌లో(wrestling weight rules) మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే, ఈ మార్పులు పూర్తి స్థాయిలో చేయకుండా కొన్ని స్వల్ప మార్పులు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అథ్లెట్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే వీటి గురించి అధికారికంగా ప్రకటిస్తారట.
కాగా, 50 కేజీల విభాగంలో పోటీ పడి 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైంది వినేశ్ ఫొగాట్. దీంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తోంది. ఈ అనర్హత వేటును సవాలు చేస్తూ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(CAS)ను ఆశ్రయించింది వినేశ్. తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరింది. ఆమె అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన కాస్ ఆగస్టు 13న సాయంత్రం ఆరు గంటల్లోగా తుది తీర్పును ఇవ్వనుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
'కుస్తీ గెలిచింది, నేను ఓడాను' - రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ - Vinesh Phogat Retirement