Paris Paralympics Pramod Bhagat suspended : టోక్యో పారాలింపిక్స్ ఛాంపియన్ ప్రమోద్ భగత్‌కు షాక్ తగిలింది. అతడిపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అనర్హత వేటు వేసింది. డోపింగ్ వ్యతిరేక నియంత్రణ ఉల్లంఘనల కారణంగా అతడిని 18 నెలల పాటు సస్పెండ్ చేసింది. దీంతో అతడు పారాలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు.
12 నెలల వ్యవధిలోనే షట్లర్ ప్రమోద్ భగత్ మూడు సార్లు పరీక్షలో ఫెయిల్ అయినట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ తెలిపింది. భగత్ చేసిన అప్పీల్‌ను సీఏఎస్ అప్పీల్స్ డివిజన్ రద్దు చేసి అనర్హత వేటు తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. దీంతో ప్రమోద్ భగత్ పారిస్ 2024 పారా ఒలింపిక్ గేమ్స్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది.
"మార్చి 1, 2024న భగత్ యాంటీ డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినట్లు సీఏఎస్ యాంటీ డోపింగ్ డివిజన్ గుర్తించింది. ఆ తర్వాత అతడు సీఏఎస్ అప్పీల్స్ డివిజన్‌కు అప్పీల్ చేసుకున్నాడు. అయితే జులై 29న సీఏఎస్ అప్పీల్స్ డివిజన్ భగత్ అప్పీల్‌ను కొట్టి పారేసింది. మార్చి 1న సీఏఎస్ యాంటీ డోపింగ్ డివిజన్ నిర్ణయాన్నే సమర్థించింది. అప్పటి నుంచి అతడిపై అనర్హత అమలులో ఉంది." అని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ స్టేట్మెంట్ విడుదల చేసింది.
Pramod Bhagat Singles Titles : కాగా, ఇటీవలే ప్రమోద్ భగత్ థాయ్‌లాండ్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఎస్ఎల్ 3 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన డానియల్ బేతల్‌ను ఓడించాడు. 14-21, 21-15, 21-15 తేడాతో డానియల్‌పై గెలిచాడు. ఇది అతడికి నాలుగో సింగిల్స్ వరల్డ్ టైటిల్ కావడం విశేషం.
దీంతో మొత్తంగా సింగిల్స్‌లో నాలుగు సార్లు ప్రపంచ టైటిళ్లు దక్కించుకున్నాడు ప్రమోద్ భగత్. అంతకుముందు 2015, 2019, 2022 సంవత్సరాల్లో ఆ టైటిల్స్ ముద్దాడాడు. అలానే టోక్యో పారాలింపిక్స్‌లో (Pramod Bhagat Tokyo Olympics Gold) పురుషుల బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్-3 విభాగంలో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.