PAK vs USA T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో పసికూన అమెరికా చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇద్దరూ పోటాపోటీగా ఆడినప్పటికీ స్కోర్లు సమం కావడం వల్ల సూపర్ ఓవర్ తప్పలేదు. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో మొదట అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్థాన్ 13 మాత్రమే చేసి ఓటమిపాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు మంచి ఆరంభం దక్కలేదు. పసికూన అమెరికా పాకిస్థాన్‌ను బాగానే కట్టడి చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బౌలర్లు చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (9), ఉస్మాన్ ఖాన్ (3), ఫకర్ జమాన్ (11) కీలక 3 వికెట్లు పవర్ ప్లేలోనే కోల్పోయింది. ఈ సమయంలో షాదాబ్తో కలిసి బాబర్ స్కోర్ బోర్డును నడిపించాడు.
వీరిద్దరు నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఈ జోడీని కెంజిగె విడగొట్టాడు. ఆ తర్వాత కూడా పాక్ టపటపా వికెట్లు కోల్పోయింది. అజామ్ ఖాన్ (0) డకౌట్ కాగా, బాబర్, ఇఫ్తికార్ అహ్మద్ (18) కూడా ఔటయ్యారు. చివర్లో షహీన్ అఫ్రిదీ (22*, 16 బంతుల్లో పరుగులు) రాణించడం వల్ల పాక్ 150 స్కోర్ దాటగలిగింది.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (44 పరుగులు, 43 బంతుల్లో; 3x4, 2x6), షాదాబ్ ఖాన్ (40 పరుగులు, 25 బంతుల్లో; 1x4, 3x6) రాణించారు. ఆమెరికా బౌలర్లలో నోష్తుశ్ కెంజిగె 3, సౌరభ్ నేత్రవాల్కర్ 2, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక సూపర్ ఓవర్లో పాకిస్థాన్ పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా అమెరికా మంచి స్కోర్ చేయగలిగింది. తొలి బంతికి ఫోర్ కొట్టిన ఆరోన్ జోన్స్ ఈ ఓవర్లో 11 పరుగులు చేయగా, మూడు బంతులను వైడ్‌గా వేసిన ఆమిర్ మొత్తం ఎక్స్‌ట్రాల రూపంలో ఏడు పరుగులు స్కోర్ చేశాడు.
ఈ క్రమంలో 19 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. నేత్రావల్కర్ బౌలింగ్‌లో తొలి బంతిని డాట్ ఆడిన ఇఫ్తికార్ రెండో బంతికి అనూహ్యంగా ఫోర్ కొట్టాడు. ఓ వైడ్ వేసిన నేత్రావల్కర్, మూడో బంతికి ఇఫ్తికార్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాతి 3 బంతుల్లో నేత్రావల్కర్ 8 పరుగులే ఇచ్చి అమెరికాను గెలిపించాడు.
ఫారిన్ జట్లలో భారత ప్లేయర్లు- వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియాకు ప్రత్యర్థులే! - T20 World Cup 2024