Padma Awards In Sports 2024 : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, సీనియర్ స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పలకు కేంద్రం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. రెండు దశాబ్దాల పాటు డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన బోపన్న ఆసియా క్రీడల్లో ఓ డబుల్స్, ఓ మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు. తాజాగా డబుల్స్‌లో నంబర్‌వన్ అయిన అత్యంత పెద్ద వయసు ఆటగాడిగానూ బోపన్న ఘనత సాధించాడు.
ఇక జోష్న కామన్వెల్త్ క్రీడల్లోని భాగంగా జరిగిన డబుల్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం అలాగే ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంలో రెండు రజతాలు, రెండు కాంస్యాలు, సింగిల్స్‌లో ఓ కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. వీరితో పాటు క్రీడా రంగం నుంచి సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), హర్బిందర్ సింగ్ (హాకీ), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), పూర్ణిమ మహతో (ఆర్చరీ), ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే (మల్లఖంబ) పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
Padma Vibhushan Awards 2024 : ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రతిష్టాత్మక 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. క్రీడా, సినీ, రాజకీయ, ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. అలా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపింది. ఇందులో 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కగా, ఐదుగురిని పద్మ విభూషణ్‌లు వరించాయి. టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీనియర్ నటి వైజయంతిమాలకు పద్మవిభూషణ్ దక్కింది. వీరితో పాటు మరో 17 మందిని పద్మభూషణ్ అవార్డులు వరించాయి. ఇక తమిళనాడుకు చెందిన దివంగత స్టార్ హీరో కెప్టెన్ విజయ్‌కాంత్‌కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఆయన మరణానంతరం ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈయనతో పాటు మరో 16 మందిని పద్మభూషణ్ వరించింది. ఇక మిగతా 110 మంది పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.