Mohammed Shami Test Series : న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. అయితే స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా, అతడికి చోటు దక్కలేదు. అలాగే బంగ్లా సిరీస్‌లో ఆడిన యశ్ దయాల్ పైన కూడా సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు, యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రాను వైస్ కెప్టెన్‌ను చేశారు.
బుమ్రాకు వైస్ కెప్టెన్- అందుకోసమేనా?
కివీస్‌తో అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండా బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే అనౌన్స్ చేశారు. అయితే ఆ సిరీస్‌లో ప్రత్యేకంగా వైస్‌కెప్టెన్ లేకపోగా, న్యూజిలాండ్ సిరీస్‌కు ఆ బాధ్యతలను బుమ్రాకు అప్పగించారు. ఈ ఏడాది నవంబరులో మొదలయ్యే బోర్డర్-గావస్కర్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకునే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ప్రకటించినట్లు సమాచారం. ఆ సిరీస్ తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మ్యాచ్‌కు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం కోసం ముందే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022లో బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుకు బుమ్రా టీమ్ ఇండియాకు సారథ్యం వహించాడు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగం
టీమ్ఇండియా పేస్ విభాగం బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్తో బలంగా ఉంది. అలాగే ట్రావెలింగ్ రిజర్వ్‌లో యువ పేసర్ మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. అలాగే అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్తో స్పిన్ విభాగం కూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక బ్యాటింగ్ విభాగానికొస్తే బంగ్లా సిరీస్లోలానే రోహిత్, యశస్వీ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ నంబరు 3లో రావొచ్చు.
అదే కారణమా?
ఆస్ట్రేలియా టూర్‌కు ముందు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌కు పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్నెస్తో జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. అయితే కివీస్‌తో సిరీస్ కోసం షమీని ఎంపిక చేయకపోవడం చూస్తుంటే, అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఆ లెక్కన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఉంటాడా? లేదా అన్నది చూడాలి. కాగా, గతేడాది నవంబరులో జరిగిన వరల్డ్ కఫ్ ఫైనల్ తర్వాత షమీ ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆటలేదు. చీలమండ గాయం కారణంగా సర్జరీ చేయించుకుని, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకుంటూ సాధన చేస్తున్నాడు.
భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
షెడ్యూల్
కాగా, అక్టోబరు 16 నుంచి భారత్- కివీస్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులో అక్టోబర్ 16-20 వరకు తొలి టెస్టు, పుణె వేదికగా అక్టోబర్ 24-28 వరకు రెండో టెస్టు, ముంబయిలో నవంబర్ 1-5 వరకు మూడో టెస్టు జరగనుంది.
సంజూ శాంసన్ ఖాతాలోకి అరుదైన ఘనత - 9 ఏళ్ల కెరీర్లో ఇదే తొలిసారి! - Sanju First Chance in 9 Years
భారత్‌లోని ఆ 3 మైదానాల్లో టెస్ట్ సెంచరీ చేయని కోహ్లీ - ఎక్కడంటే?