Border Gavaskar Trophy Shami : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ నవంబర్‌లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవ్వలేదు. ఫిట్‌నెస్ కారణాల వల్ల సెలక్టర్లు షమీని పక్కన పెట్టారు. అయితే ఏడాదిపాటు క్రికెట్‌కు దూరంగా ఉంటున్న షమీ, ఈ పర్యటనతో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు.
కానీ, షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల చోటు దక్కలేదు. దీంతో ఫిట్‌నెస్ విషయంలో అందరి అంచనాలను అందుకోలేక పోయినందుకు బీసీసీఐ, ఫ్యాన్స్‌కు షమీ సారీ చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను షమీ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. ఫిట్‌నెస్ ట్రైనర్ సహాయంతో తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్నట్లు వీడియోలో ఉంది.
'రోజు రోజుకూ బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నా. మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇంకా శ్రమిస్తా. దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తా. క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి సారీ చెబుతున్నా. టెస్టు క్రికెట్ ఆడేందుకు త్వరలోనే మీముందుకొస్తా' అని షమీ షోస్టు షేర్ చేశాడు. ఇక షమీ త్వరగా టీమ్ఇండియాలోకి రావాలని, అతడి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
రంజీల్లో ఎంట్రీ
కాగా, నవంబర్ 6 నుంచి రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో షమీ బంగాల్ తరఫున బరిలోకి దిగుతాడని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ పోస్టుతో దీనిపై క్లారిటీ వచ్చింది. రంజీల్లో షమీ ఎంట్రీ ఇవ్వడం ఇక లాంఛనమే అనిపిస్తోంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీశ్ కుమార్ రెడ్డి.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు ప్రకటన- తెలుగు కుర్రాడికి లక్కీ ఛాన్స్