Mayank Yadav IPL 2024: 2024 ఐపీఎల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు మయంక్ యాదవ్. 21 ఏళ్ల ఈ లఖ్‌నవూ పేస్ బౌలర్ అత్యంత వేగవంతమైన బంతులు సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నాడు. ప్రస్తుత టోర్నమెంట్లో నిలకడగా 150+ kmph స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్న మయంక్ లైన్ అండ్ లెంగ్త్ కూడా రాబడుతున్నాడు. ఏకంగా ఐపీఎల్ చరిత్రలో టాప్-5 వేగవంతమైన బంతుల్లో మయంక్ చోటు సాధించాడు. అతడు తాజాగా చిన్నస్వామి వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 156.7 kmph స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు. కాగా, ఇది ఐపీఎల్లో నాలుగో అత్యంత వేగవంతమైన బంతి.
అయితే ఇంతటి నాణ్యమైన బౌలర్‌కు షూస్ (Shoes) స్పాన్సర్లు లేరట. టోర్నీ కోసం అతడి షూస్ తనే ఖరీదు చేశాడని సోషల్ మీడియాలో ఓ వార్త హైలైట్ అవుతోంది. కానీ, దీనిపై మయంక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు విదేశీ ఆటగాళ్లను రూ. కోట్లు పెట్టి కొనుగోలు చేయడం కంటే ఇలాంటి లోకల్ కుర్రాళ్లని ప్రోత్సహించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక స్పీడ్ ఒక్కటే కాకుండా ఈ మ్యాచ్‌లో మయంక్ అదరగొట్టాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్‌ను ఔట్ చేసి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా మయంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. 2024 టీ20 వరల్డ్కప్నకూ ఈ యువ పేసర్‌ను టీమ్ఇండియా జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికైనా టీమ్ఇండియాకూ ఆడడమే తన లక్ష్యమని మయంక్ అన్నాడు.
ఇక మ్యాచ్ అనంతరం మయాంక్ మాట్లాడాడు. 'వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో మేం విజయం సాధించాం. వేగంగా బౌలింగ్ చేయడానికి డైట్, సరిపడ నిద్ర, శిక్షణ చాలా అవసరం. వేగంగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్‌పై నిరంతరం శ్రద్ధపెడుతున్నాను. ఎప్పటికైనా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా టార్గెట్. కెరీర్లో నా జర్నీ ఇప్పుడే మొదలైంది. గ్రీన్ వికెట్ చాలా సంతోషాన్నిచ్చింది' అని మయంక్ అన్నాడు.
విజృంభించిన మయాంక్- చెలరేగిన డికాక్, పూరన్- ఆర్సీబీపై లఖ్‌నవూ విజయం - RCB vs LSG IPL 2024