Lucknow Super Giants Mentor Zaheer Khan : మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్రాంఛైజీల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే సాధారణంగా మెగా వేలానికి ముందు రిటైన్డ్ ఆటగాళ్ల గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ఏ ప్లేయర్స్‌ను అట్టిపెట్టుకుంటారనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ బాగా ఉంటుంది. కానీ ఈ సారి దీంతో పాటే కోచింగ్ స్టాఫ్‌పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎందుకంటే మెగా ఆక్షన్‌కు ముందే ఆయా ఫ్రాంఛైజీలు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జట్టును బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఆక్షన్‌కు ముందే అనుభవజ్ఞులను తమ ఫ్రాంఛైజీలలోకి తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తీసుకోవాలని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ భావిస్తున్నట్లు సమాచారం. జహీర్‌కు మెంటార్‌గా బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట. వాస్తవానికి టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను తీసుకుంటారని ఈ మధ్య జోరుగా ప్రచారం సాగింది. జహీర్ ఎంపిక కోసం బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కథనాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జహీర్‌ను కాదని మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకున్నాడు. అంతకుముందు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కోసం గంభీర్ - మోర్కెల్ కలిసి పని చేశారు.
అయితే ఇప్పుడు గంభీర్ రిజెక్ట్ చేసిన జహీర్‌నే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తీసుకోబోతుందట. మెంటార్‌తో పాటు బౌలింగ్ కోచ్ బాధ్యతలను అప్పగించాలని ప్రణాళిక చేస్తోంది! ఇప్పటికే జట్టులో మయాంక్ యాదవ్ వంటి యంగ్ పేసర్లు ఉన్నారు. కాబట్టి జహీర్ వస్తే యంగ్ బౌలర్లు మరింత రాటు దేలుతారని లఖ్‌నవూ ఫ్రాంఛైజీ భావిస్తోందని సమాచారం.
ఇకపోతే ప్రస్తుతం లఖ్‌నవూ ప్రధాన కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా లాన్స్ క్లూసెనర్, ఆడమ్ వోగ్స్, జాంటీ రోడ్స్ వ్యవహరిస్తున్నారు. ఇక జహీర్ ఖాన్ టీమ్ ఇండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌ను భారత జట్టు సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.
'బాత్రూమ్లు, సీట్లు సరిగ్గా లేవు!' పాక్ స్టేడియాల పరిస్థితిపై PCB ఛైర్మన్ - Champions Trophy 2025