Love Proposal In Paris Olympics 2024 : సాధారణంగా ప్రేమలో ఉన్న ప్రతీ జంట తమ లైఫ్‌లో ఓ డ్రీమీ ప్రపోజల్ ఉంటే బాగున్ను అని అనుకుంటుంటారు. ప్రియుడు, లేదా ప్రేయసి ఇలా ఎవ్వరో ఒకరు తమ అభిరుచులు, సౌకర్యానికి తగ్గట్లుగా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసుకుని తమ ప్రియమైన వారికి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. లైఫ్‌టైమ్ మెమరీలను క్రియేట్ చేస్తుంటారు. అయితే ఓ క్రీడాకారుడు మాత్రం తనకిష్టమైన ప్రదేశంలో ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు దాదాపు తొమ్మిదేళ్లు వెయిట్ చేశాడు. తాజాగా ఆ మూమెంట్‌ను నిజం చేసి నెట్టింట వైరలయ్యాడు. ప్రేమకు నెలవైన పారిస్‌లో ఆ డ్రీమీ ప్రపోజల్ ఎలా సాగిందంటే?
ఆ ఈవెంట్‌లోనే చూపులు కలిశాయి
అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్‌పోయ్ లవ్ స్టోరీ దాదాపు 9 ఏళ్ల క్రితం మొదలైంది. 2015లో ఓ క్రీడా ఈవెంట్‌లో తొలిసారి కలుసుకున్నారు ఈ ఇద్దరూ. తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. నెమ్మదిగా వీళ్ల స్నేహం కాస్త ప్రేమబంధంగా మారింది. అయితే కొంతకాలం తర్వాత తమ ప్రేమను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసిన ఈ జంట, 2016 రియో ఒలింపిక్స్‌లో తమ తమ క్రీడల్లో పాల్గొని సత్తా చాటారు.
ఆ తర్వాత ఇప్పుడు ఈ జంటకు పారిస్ ఒలింపిక్స్‌లో మరోసారి కలిసి పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో ప్రేమకు చిహ్నమైన ఈ నగరంలో తన ప్రేయసికి తన మనసులోని ప్రేమను తెలపాలనుకున్నాడు. అయితే ఈ క్షణం కోసం అతడు ఏకంగా తొమ్మిదేళ్ల పాటు ఎదురుచూశాడు. ఇటీవలే ఆ కల నిజమవ్వడంతో మన హీరో ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. ప్రపోజల్ అందుకున్న హీరోయిన్ కూడా సంతోంషంతో ఉప్పొంగిపోతోంది.
అప్పుడే ఓకే చెప్పింది
ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన అర్జెంటీనా హ్యాండ్‌బాల్ జట్టుతో పాటు ఆ దేశ మహిళల ఫీల్డ్ హాకీ జట్టు ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఓ ఫొటో సెషన్‌లో పాల్గొన్నాయి. ఇక ఇదే మంచి ఛాన్స్ అని అనుకున్న పాబ్లో, హాకీ జట్టు ముందు మోకాలిపై నిల్చుని 'ఐ లవ్యూ డియర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ అడిగాడు. అయితే పాబ్లో ఇలా ప్రపోజ్ చేస్తాడని మరియా అస్సలు ఊహించలేదట. దాంతో ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయిన ఆమె, పాబ్లోను గట్టిగా హగ్ చేసుకుంది. 'ఊ' అంటూ సిగ్గు పడుతూనే తనముందుకు చేయి చాచి వేలికి ఉంగరం తొడిగించుకుంది. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఈ జంటను హత్తుకుని ఆ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ తర్వాత తన ప్రియుడు తొడిగిన ఉంగరాన్ని చూపుతూ ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఆ ఫొటోలు, వీడియోలను పాబ్లో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అంతకంటే ముందే ఈ అందమైన ఈవెంట్‌ను వీడియోగా రూపొందించి 'ది ఒలింపిక్స్' మేనేజ్‌మెంట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది.
మంచు కొండల్లో ప్రపోజల్ - ప్రియుడికి ఎస్ చెప్పిన 'ఎవడు' బ్యూటీ