KapilDev Team Demands Cash T20worldcup 2024 Prize Money : 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఓ భారత మాజీ క్రికెటర్, తమ జట్టుకు కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో భారతదేశంలో క్రికెట్ క్రేజ్ మరింత పెరిగింది.
భారతదేశం 1983 ప్రపంచ కప్‌లో అండర్‌డాగ్స్‌గా ప్రవేశించింది. చాలా మంది ఇండియా నుంచి కనీసం గట్టి పోటీని కూడా ఆశించలేదు. కానీ అసాధారణ ఆటతీరుతో బలమైన జట్లను సైతం చిత్తు చేసి భారత్ వరల్డ్ కప్ సాధించింది. ఈ విజయంతో భారత్‌లో క్రికెట్‌కి పాపులారిటీ పెరిగింది.
- క్యాష్ ప్రైజ్ కోరిన మాజీ ప్లేయర్
ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, 1983 జట్టు నగదు బహుమతి కోసం బీసీసీఐని సంప్రదించింది. అయితే ఆ సమయంలో బోర్డు వద్ద డబ్బు లేదనే సమాధానం ఎదురైంది. అయితే ఇప్పుడు బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు. పైగా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు రూ.125కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించింది. దీంతో 1983 వరల్డ్ కప్ టీమ్‌లోని ఓ సభ్యుడు IANS వార్తా సంస్తో మాట్లాడుతూ, బోర్డు ఇప్పుడు తమ జట్టుకు ఎందుకు క్యాష్ రివార్డ్ ఇవ్వకూడదని ప్రశ్నించారు.
‘రూ.125 కోట్లు చాలా పెద్ద అమౌంట్. టీమ్ ఇండియాకు సంతోషం. సరే, ఆ సమయంలో (1983 ప్రపంచకప్ విజయం తర్వాత) మాకు క్యాష్ రివార్డులు ఇవ్వలేదు. మా దగ్గర డబ్బు లేదని బోర్డు చెప్పింది. ఇప్పుడు వారు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. మరి ఇప్పుడు మాకెందుకుఇవ్వలేకపోతున్నారు.’ అని అన్నారు. 1983 స్క్వాడ్‌లో ఉన్నవారిలో ప్రస్తుతం కొంతమంది మాత్రమే బాగున్నారని, మిగిలిన వారు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలించాలని కోరారు.
- 1983 స్క్వాడ్‌లో ప్రముఖులు
1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, కె శ్రీకాంత్, కపిల్ దేవ్ వంటి ఆటగాళ్ళు ప్రస్తుతం కామెంటేటర్స్ లేదా ఎక్స్‌పర్ట్స్‌గా పని చేస్తున్నారు. వారి సహచరులు చాలా మంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. - 1983 విక్టరీ ప్రభావం
1983 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి అనేక మంది ప్రపంచ స్థాయి క్రికెటర్లను దేశం ఉత్పత్తి చేసింది. 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో రెండో సారి భారత్ వన్డే ప్రపంచ కప్పు గెలచింది. ఈ కప్పు కోసం ఇండియా, ఏకంగా 28 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది.
దాదాపు అదే స్థాయి ఎదురుచూపులు తర్వాత భారత్, 2024 టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. దీంతో ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన వేడుకలో జట్టు, కోచింగ్ సిబ్బంది , సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ.125 కోట్ల క్యాష్ ప్రైజ్ అందజేసింది.
అయితే ప్రస్తుతం 1983 జట్టు సభ్యుడు చేస్తున్న డిమాండ్ సరైనదేనని, బీసీసీఐకి ఇప్పుడు క్యాష్ ప్రైజ్ ఇబ్బడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్ భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను గౌరవించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.