IPL 2024 Title Winner KKR : రికార్డుల మోత మోగించిన సన్‌రైజర్స్ చిత్తు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని మరోసారి ఎగరేసుకుపోయింది. వాస్తవానికి సన్ రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ చూసి హైదరాబాద్‌దే విజయమని అంచనాలు వేశారంతా. కానీ కోల్‌కతా ఆ అంచనాలను తారుమారుచేసింది. ఇంకా చెప్పాలంటే పదిహేడో సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ సేనను జట్టుగా పరిశీలించి చూస్తే ఆ టీమ్‌లో బలమేకానీ బలహీనతే లేదని చెప్పొచ్చు.
యజమానిగా షారూక్ ప్రోత్సాహం, మెంటార్‌గా గౌతమ్ గంభీర్ మార్గదర్శత్వం. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పటిమ, ఆటగాళ్లలో గెలవాలన్న కసి వెరిసి బలహీనతే కానరాని జట్టుగా కోల్‌కతా సరికొత్త చరిత్రను సృష్టించింది. అందుకే బలంగా కనిపించిన సన్‌రైజర్స్‌ను పది ఓవర్లలోనే కేకేఆర్ చిత్తుచేసింది.
ప్రతి వేలంలోనూ పోటీనిచ్చే 11 మందితో జట్టును తయారుచేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ - వారిలో ఎవరైనా దూరమైనా బ్యాకప్ ఎలా అనేది పెద్దగా ఆలోచించకుండానే ముందుకెళ్లేది. 2024 సీజన్ కూడా అలాగే సిద్ధమైంది. శ్రమ, పట్టుదలతో జట్టుగా ఆడిన కేకేఆర్ అసాధ్యమనుకున్న ట్రోఫీని సాధించగలిగింది.
సాల్ట్ - నరైన్ జోడీ - లీగ్ ఆరంభం నుంచి హైదరాబాద్ ఓపెనర్ల దూకుడే ఎక్కువగా వినిపించినప్పటికీ తామేం తక్కువ కాదంటూ కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ - సునీల్ నరైన్ జోడీ అదిరే ప్రదర్శన చేసింది. ఇక ప్లేఆఫ్స్‌కు సాల్ట్ దూరమైనా అతడి స్థానంలో వచ్చిన గుర్బాజ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆడాడు.
పక్కనపెట్టేయకుండా మద్దుతుగా - ఇక టోర్నీ మధ్యలో హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి కోల్‌కతా బౌలర్ హర్షిత్ రాణా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందుకు తొలి మ్యాచ్‌లోనే భారీ జరిమానా పడింది. అంతమాత్రాన అతడిని కేకేఆర్ పక్కన పెట్టలేదు. అతడికి మద్దతుగా నిలిచి మరిన్ని అవకాశాలు ఇచ్చింది. తర్వాత హర్షిత్ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో హర్షిత్ 19 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్‌తో జరిగిన ఫైనల్లోనూ తానెంత విలువైన ఆటగాడో చాటాడు.
హర్షిత్ రాణాకు బ్యాటింగ్‌లోనూ రాణించే సత్తా ఉండడం కేకేఆర్‌కు కలిసి వచ్చింది. ఫ్లస్ట్ క్లాస్ క్రికెట్‌లో 49 సగటు ఉన్న హర్షిత్ రాణా కేకేఆర్ టీమ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో 9వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో మాత్రం ముందు వరసలో ఉన్నాడు. అలా అతడి ఆల్ రౌండ్ సామర్ధ్యాన్ని కోల్‌కతా ఉపయోగించుకుంది.
జట్టులో టాప్ వికెట్ టేకర్స్ - రమణ్ దీప్, శ్రేయాస్ అయ్యర్ కాకుండా కోల్‌కతాకు 7 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ లేకుండానే రెండు గేమ్‌లు ఆడిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు 110 వికెట్లు తీయడం 13సార్లు మాత్రమే జరిగింది. ఈ సీజన్‌లో కేకేఆర్ 14 గేమ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. మరో జట్టుకు ఈ రికార్డు సాధ్యంకాలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ కోల్‌కతా సగటున 7.86 వికెట్లు పడగొట్టింది.
అయితే కేకేఆర్ పర్పుల్ కేప్‌ను గెలుచుకోలేదు. కానీ ఆ జట్టులో టాప్ 20 వికెట్ టేకర్స్ ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. వరుణ్ చక్రవర్తి అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అయితే అతడికి ఫైనల్లో 12 ఓవర్ వరకూ బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదంటే కోల్‌కతా బలమేంటో అర్థమవుతోంది.
బ్యాటింగ్లోటాప్ - ఇక ఈ సీజన్‌లో మొదటి ఉత్తమ బ్యాటింగ్ టీమ్‌గా కేకేఆరే నిలిచింది. వాస్తవానికి కోల్‌కతా జట్టులో టాప్ 3లో పెద్ద హిట్టర్‌లు ఎవరూ లేరు. అయితే ఒక జట్టుగా మాత్రం కేకేఆర్ అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా నిలిచింది. రెండో స్థానంలో దిల్లీ కేపిటల్స్ ఉంది.
కెప్టెన్సీ టాప్ - మైదానంలో టీమ్‌ను సమర్థవంతంగా నడిపించాడు కెప్టెన్ శ్రేయస్. ఈ విషయంలో 100 శాతం అత్యుత్తమ సారథిగా నిలిచాడు. బ్యాటింగ్‌లోనూ మిడిలార్డర్‌లో వచ్చే అతడు 351 పరుగులు చేశాడు. ఫైనల్‌లో బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడంలోనూ కీలక పాత్ర పోషించాడు.
మొత్తంగా కేకేఆర్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండడం ఆ జట్టుకు అదనపు బలంగా మారింది. వైభవ్ అరోరా, స్టార్క్ కొత్త బాల్‌తో పవర్ ప్లేలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పవర్ ప్లే తర్వాత హర్షిత్ రాణా, సునీల్ నరైన్ తమ వంతు పాత్రలను సమర్థంగా పోషించారు. వారి ఎకానమీ రేటు కూడా అత్యుత్తమంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదం చేశారు. బ్యాటింగ్‌లో షార్ట్ బాల్‌ను ఎదుర్కొనే సమస్యను కొద్ది మ్యాచ్‌లోనే వారు అధిగమించారు. రస్సెల్, రింకూ సింగ్, రమణ్ దీప్‌లను ఛేజింగ్‌లో చాలా తక్కువగానే కేకేఆర్ ఉపయోగించాల్సి వచ్చింది. అందుకే జట్టుగా కేకేఆర్‌కు బలహీనతలు పెద్దగా కనిపించలేదు.
IPL ప్రైజ్‌మనీ- 'కోల్‌కతా'కు రూ.20 కోట్లు- మరి ఎవరెవరికి ఎంతంటే? - IPL 2024
'అయ్యర్' ది విన్నింగ్ కెప్టెన్- ట్రోఫీతో ఫుల్ సెలబ్రేషన్స్- రోహిత్ రికార్డు సమం - IPL 2024