IPL 2024 RCB VS KKR Kohli Fined : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరుస వివాదాలకు వేదిక అవుతోంది. ప్రస్తుతం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొందరు మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కాట్ అండ్ బౌల్డ్‌పై చర్చలు మొదలయ్యాయి. కొందరు విరాట్‌కు మద్దతుగా మాట్లాడుతుండగా, మరి కొందరు అంపైర్ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. ఏదేమైనా అంపైర్‌ల నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన తీరును తప్పుబడుతూ చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. మ్యాచ్ ఫీజులో అతడికి 50 శాతం జరిమానా విధించారు.
ఏప్రిల్ 21న ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు సాధించింది. అనంతరం ఛేజింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దురదృష్టవశాత్తు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. టోర్నీలో ఆర్సీబీ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్కదాంట్లో గెలిచింది. 7 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. వీటన్నింటికి మించి మ్యాచ్‌లో కోహ్లీ కాట్ అండ్ బౌల్డ్ కావడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
- వివాదం ఏంటి?
ఆర్సీబీ ఓపెనర్ కోహ్లీ దూకుడుగా ఛేజింగ్ మొదలుపెట్టాడు. మూడో ఓవర్‌లో హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్ టాస్‌ను క్రీజు నుంచి ముందుకొచ్చి ఆడాడు. బాల్ నేరుగా వెళ్లి హర్షిత్ రాణా చేతిలో పడింది. అంపైర్‌లు కాట్ అండ్ బౌల్డ్‌గా ప్రకటించడంతో అతడు నో బాల్ కదా అంటూ రివ్యూ కోరాడు. కానీ అప్పటికే థర్డ్ అంపైర్ కూడా అవుట్‌గానే ప్రకటించాడు. బంతి బ్యాటర్ నడుం కన్నా ఎత్తులో వెళ్తే దాన్ని నో బాల్‌గా ప్రకటిస్తారు. కానీ, ఆ బంతిని ఆడుతున్నప్పుడు బ్యాటర్ క్రీజు లోపల ఉండాలి. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ క్రీజు బయటకు వచ్చి ఆ బంతిని ఆడాడు. దీంతో బంతి విరాట్ నడుం కన్నా ఎత్తులో వచ్చినా ఔట్‌గా పెలివియన్ చేరాల్సి వచ్చింది. అయితే విరాట్ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా, అతడు ఆడుతున్నప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులో వచ్చిందని అంపైర్ టెక్నాలజీ సాయంతో నిర్దారించారు. దీంతో తన ఔట్ విషయమై విరాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్‌లతో వాగ్వాదానికి దిగాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఏడు బంతుల్లో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. - కోహ్లీకి జరిమానా
దీనికి సంబంధించి ఐపీఎల్ విడుదల చేసిన ప్రకటనలో - ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం విరాట్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కోహ్లీ నేరాన్ని, మ్యాచ్ రిఫరీ చర్యలను అంగీకరించాడు. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘనలకు, మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమం అని పేర్కొన్నారు. అయితే ఇదే మ్యాచ్‌లో ఓవర్ రేట్ అఫెన్స్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ రూ.12 లక్షల జరిమానా విధించిన కొద్దిసేపటికే విరాట్ కోహ్లీపై కూడా చర్యలు తీసుకున్నారు.
ఆర్సీబీ ఇక అలా చేస్తేనే ప్లేఆఫ్స్ రేసులోకి! - IPL 2024 RCB Play offs