IPL 2024 క్రికెట్ లవర్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు అందరి నోట ఒకే మాట వస్తోంది. అదే ఐపీఎల్. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ సీజన్ మొదలైందంటే ఇక ఎటు చూసినా ఐపీఎల్ చర్చలు, మాటలే వినిపిస్తుంటాయి. అభిమానుల్లో ఉత్సాహం, టీమ్‌ల మధ్య పోటీ, ఆటలో మజా ఏటా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ఎందుకు ఈ లీగ్‌కి ఇంత క్రేజ్. ఐపీఎల్ జరిగే రెండు నెలలు అందరూ ఎందుకు ఈ క్రీడకు అభిమానులైపోతారు? దీనికి సమాధానం ఓ ఐపీఎల్ అభిమాని మాటల్లో తెలుసుకుందాం.
2008 ఏప్రిల్ 18న, చాలా మంది విద్యార్థులు కాలేజీ ఫైనల్ ఎగ్జామ్స్‌తో బిజీగా ఉండగా, భారత క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనం చోటు చేసుకుంది. ఆ రోజే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టింది. క్రికెట్ చరిత్రలో విప్లవాత్మక మార్పులతో అడుగుపెట్టిన ఐపీఎల్‌కి అందరూ అభిమానులుగా మారిపోయారు. వారిలో నేను కూడా ఒకడ్ని.
ఆ రోజు, నేను ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్‌పై ఆసక్తితో నా మనస్సు బెంగళూరు చుట్టూ తిరుగుతోంది. ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ఐపీఎల్ చూడటానికి ఇంటికి పరిగెత్తాను. సమయానికి ఇంటికి చేరుకోవడంతో మొదటి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగుల విధ్వంసాన్ని చూడగలిగాను. నా ఐపీఎల్ మరుపురాని ప్రయాణానికి ఇదే వేదికైంది. ఆర్సీబీపై కేకేఆర్ 140 పరుగుల తేడాతో గెలిచింది. 2013లో పుణె వారియర్స్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 175 నాటౌట్ గా నిలిచే వరకు ఐపీఎల్ హిస్టరీలో మెకల్లమ్‌తో అత్యధిక స్కోరుగా మిగిలింది.
ఇదీ ఓ పండగే!
ఆ తర్వాత ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్‌గా మాత్రమే కాకుండా, దానికి గ్లామర్ తోడైంది. షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు టీమ్‌లను కలిగి ఉండటం వల్ల, అభిమానుల్లో ఉత్సాహం కొత్త శిఖరాలకు చేరుకుంది. స్టేడియంలో ఆకర్షణ, స్టార్స్ కమర్షియల్స్‌తో ఐపీఎల్ ఓ పండుగలా మారింది. ఐపీఎల్‌పై చేసిన మొట్టమొదటి జింగిల్ గుర్తుందా? అదే 'మనోరంజన్ కా బాప్' కమర్షియల్. హృతిక్ రోషన్, శిల్పా శెట్టి, ఫరా ఖాన్ వంటి ప్రముఖులు క్రికెట్ కార్నివాల్‌కు మరింత ఫ్లేవర్‌ని జోడించారు. ఇదిలా ఉండగా, ఈ 17వ ఎడిషన్ సమీపిస్తున్న కొద్దీ క్రేజ్ ఎప్పటిలాగే బలంగా ఉంది. లక్షలాది మందిని ఆకర్షిస్తున్న ఐపీఎల్‌లో ఏముందంటే?
సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెట్ దిగ్గజాలు తమ జట్టుకు నాయకత్వం వహించడాన్ని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. మరికొందరు బాలీవుడ్ ఫ్యాక్టర్‌తో ఆకర్షితులవుతారు. ఐపీఎల్ నాణ్యమైన క్రికెట్ కంటే, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాధాన్యత ఇస్తుందని కొందరు వాదించినప్పటికీ, లీగ్ ఇప్పటికీ నైపుణ్యం, ప్రతిభను కోరుతుంది. ఐపీఎల్‌లో విజయం అంత తేలికైన విషయం కాదని రుజువు చేస్తూ అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లు గణాంకాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ ఐపీఎల్!
వ్యక్తిగతంగా, ఐపీఎల్ పట్ల నా ఉత్సాహం సంవత్సరాలుగా క్షీణించింది. నేను ఇప్పటికీ అది అందించే వినోదాన్ని ఆస్వాదిస్తున్న ప్పటికీ, నేను టెస్ట్ క్రికెట్ ఇంటెన్సిటీ ఇష్టపడతాను. చాలా మంది ఫాంటసీ లీగ్‌ల ద్వారా లేదా టీవీలో మ్యాచ్‌లను ఆస్వాదించడంతో ఐపీఎల్ ఎక్సైట్‌మెంట్‌లో భాగమవుతారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు రెండు నెలలపాటు ఉత్కంఠభరితమైన క్రికెట్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నారు. మీరు ఐపీఎల్‌కి వీరాభిమాని అయినా లేదా సాధారణ పరిశీలకుడైనా, ఐపీఎల్‌లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది.