IPL 2024 Mitchell Marsh : ఐపీఎల్ - 2024లో దిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ టోర్నమెంట్‌లోని మిగతా మ్యాచులకు దూరమయ్యాడని తెలిసింది. చీలమండ నొప్పి (యాంకిల్ పెయిన్) వల్ల అతడు చికిత్స కోసం తన స్వదేశానికి వెళ్లాడు. ఇప్పట్లో అతడు తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు.
కాగా ఈ నెల 12న మార్ష్ క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య సిబ్బందిని సంప్రదించడానికి పెర్త్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి గాయాన్ని పరిశీలించి అంచనా వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ టీమ్ అక్కడే ఉండాలని అతడిని సూచించినట్లు పాంటింగ్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌నకు సమయం దగ్గరపడుతుండడం వల్ల కూడా అతడిని భారత్‌కు పంపించి రిస్క్ చేయకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా భావించిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే వరల్డ్ కప్‌లో ఆసీస్ కెప్టెన్‌గా మార్ష్ వ్యవహరించే ఛాన్స్ ఉందని తెలిసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిగా అతడు ఆడాడు. ఆ తర్వాత ముంబయి, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో లేడు. ఇక ఈ టోర్నీలో విఫలమైన మిచెల్ మొత్తంగా ఈ సీజన్‌లో దిల్లీ తరపున నాలుగు మ్యాచులు మాత్రమే ఆడాడు. 23 పరుగుల అత్యధిక స్కోరుతో 61(రాజస్థాన్‌పై) పరుగులు చేశాడు. ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ప్రస్తుతం మూడు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్‌లో ఛాన్స్ దక్కించుకోవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదింటిలో గెలిచి తీరాలి. కాగా, దిల్లీ క్యాపిటల్స్ తన తర్వాత మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌పై ఆడనుంది.
మరి మిచెల్ మార్ష్ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్ ఎవరిని తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే లుంగి ఎన్‌గిడి కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. హ్యారీ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు. డేవిడ్ వార్నర్, ఇషాంత్ శర్మలు కూడా గాయాల వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యారు.
ఫీల్డ్ అంపైర్‌తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR
ఫీల్డ్ అంపైర్‌తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR