IPL 2024 Australian Players : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఎంతో మంది ప్లేయర్లు ఊహించని స్థాయిలో ఆడి తమ తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. రెమ్యూనరేషన్‌తో సంబంధం లేకుండా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సారి కొంత మంది ప్లేయర్లు మాత్రం మినీ వేలంలో అత్యధిక ధర పలికినప్పటికీ క్రీజులో మాత్రం పేలవ ఫామ్‌తో అభిమానులను నిరాశపరిచారు. కానీ ఈ ఐపీఎల్ ఆరంభంలో మాత్రం రికార్డు రేటు పలికిన ఓ ఇద్దరు ఆటగాళ్లు మొదట్లో నిరాశపరిచేలా కనిపించినప్పటికీ, చివరిలో తమ అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టి అందరినీ అబ్బురపరిచారు.
కేకేఆర్ మెయిన్ పిల్లర్ - మిచెల్ స్టార్క్
ఐపీఎల్ సీజన్ 17 కోసం జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. భారీ అంచనాలతో స్టార్క్‌ను బరిలోకి దింపిన కేకేఆర్ జట్టుకు తొలుత నిరాశే మిగిలింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా రెండు మ్యాచ్‌ల్లో కలిపి వంద పరుగులు సమర్పించుకున్నాడు. జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తాడని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న సమయంలో స్టార్క్ ఇలాంటి ఫామ్ కనబరిచే సరికి అటు కోల్‌కతా జట్టతో పాటు ఇటు అభిమానులు కూడా నిరాశచెందారు.
అయితే లీగ్ దశ ఆరంభంలో అతడ్ని అంచనా వేసినవారిని అవాకయ్యేలా చేశాడు. కీలక మ్యాచ్‌ల్లో అదరగొట్టి జట్టుకు అండగా నిలిచాడు. ముఖ్యంగా ప్లేఆఫ్ రేసులో నిలకడగా రాణించాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో మూడు వికెట్లతో తన సత్తా చాటాడు. అలా తన రేటుకు అతడు పూర్తి న్యాయం చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు.
కెప్టెన్సీలో దిట్ట - సన్‌రైజర్స్ కొత్త వెలుగు కమిన్స్
ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు అద్భుత పెర్ఫామెన్స్‌తో చెలరేగిపోయింది. మొదటి మూడు మ్యాచుల్లో అంతంత మాత్రంగా ఆడిన ప్లేయర్లు, ఆ తర్వాత వేగం పుంజుకుని ఎన్నో కొత్త రికార్డులను సృష్టించారు. దీనికంతటికి కారణం ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్.
11 ఏళ్లుగా ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును ఈ సీజన్లోనే సన్‌రైజర్స్ రెండుసార్లు బద్దలు కొట్టింది. జట్టును ఇలా మార్చే విషయంలో కమిన్స్ కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ జట్టుకు మంచి ఇన్నింగ్స్. 16 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాటుతోనూ అదరగొట్టాడు. ప్లేఆఫ్స్ దశలో జట్టు నిలకడ తప్పినప్పటికీ కమిన్స్ మాత్రం సూపర్ ఫామ్‌లో కొనసాగాడు. ఫైనల్స్‌లోనూ 24 పరుగులతో అతడే టాప్ స్కోరర్. బౌలింగ్‌లోనూ ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
IPL ప్రైజ్‌మనీ- 'కోల్‌కతా'కు రూ.20 కోట్లు- మరి ఎవరెవరికి ఎంతంటే? - IPL 2024