India Vs South Africa 1st T20 : డర్బన్ వేదికగా తాజాగా జరిగిన భారత్- దక్షిణాఫ్రికా తొలి టీ20లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
హార్దిక్ ఓవర్‌లో భారీ సిక్సు
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాకు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌కి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. చాలా త్వరగా కెప్టెన్ మార్‌క్రమ్ వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా 114-8తో ఓటమి అంచున నిల్చంది. 16 ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కి వచ్చాడు. ఈ ఓవర్‌లో గెరాల్డ్ కోయిట్జీ రెండు భారీ సిక్సులు కొట్టాడు. ఓ సారి బాల్ స్టేడియం అవతల పడింది. అక్కడున్న ఓ వ్యక్తి బాల్ తీసుకున్నాడు. బంతిని జేబులో పెట్టుకుని పారిపోయాడు. అక్కడున్న భద్రతా సిబ్బంది అతడిని వెంబడించినా ఫలితం లేకపోయింది.
బాల్ ఇచ్చేయండి బ్రదర్!
ఈ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆకాష్ చోప్రా, "హే దాన్ని తిరిగి ఇవ్వండి మిత్రమా. ఆ బంతి చాలా ఖరీదైనది. కూకబుర్ర బంతులు చాలా ఖరీదైనవి బ్రదర్" అని చెప్పాడు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారంలో చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తొలి టీ20లో టీమ్ఇండియా 61 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టు నిర్దేశించిన 203 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు విఫలమయ్యారు. దీంతో 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటయ్యారు. ఇందులో హెన్రిచ్ క్లాసెన్ (25 పరుగులు) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఆవేశ్ ఖాన్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
రెండో టీ20 ఎప్పుడంటే?
మొదటి టీ20లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టీ20 నవంబర్ 10న ఆదివారం జరగనుంది. సెయింట్ జార్జ్ ఓవల్ గక్బెర్హాలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఒకే ఏడాదిలో 100 సిక్స్‌లు - క్లాసెన్ కెరీర్లో రేర్ రికార్డు!