India Vs Pakistan 2025 Champions Trophy : పాకిస్థాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఆ దేశానికి వెళ్తుందా లేదా అనేది ఎంతోకాలంగా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. టీమ్ఇండియాను పాక్‌కు ససేమిరా పంపించేది లేదంటూ గతంలోనే బీసీసీఐ తేల్చి చెప్పగా, భద్రతా సమస్యలు, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే దీనికి కారణమని క్రికెట్ వర్గాల వాదన.
అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎన్నో అగ్ర దేశాలు అలాగే చిన్న దేశాలు కూడా పాక్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని, అయితే భారత్ మాత్రం వచ్చేందుకు ఎందుకు రాజీ పడటం లేదని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ సంబంధాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
"చర్చలు, బాంబులు ఒకేసారి కొనసాగవు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్థాన్‌తో మేము చర్చలు జరిపేందుకు అనుకూలం కాదు. కానీ, కశ్మీర్ యువతతో కచ్చితంగా మాట్లాడుతాం" అని అమిత్ షా పేర్కొన్నారు. పాక్‌తో చర్చలు, ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు డిమాండ్ చేస్తున్నాయంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. చూస్తుంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లదంటూ ఆయన తన మాటల ద్వారా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు దానిశ్ కనేరియా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదంటూ తాజాగా పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచిదని కనేరియా తెలిపాడు.
'ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితులను చూస్తే, టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచిది. నేను కూడా టీమ్ఇండియాను పాకిస్థాన్ వెళ్లవద్దనే చెబుతాను. దీనిపై పాకిస్థాన్ కూడా ఓసారి ఆలోచించాలి. ఆ తర్వాత ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికైనా ఆటగాళ్ల భద్రతయే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత గౌరవం అనేది రెండో ప్రాధాన్యం. ఈ విషయంలో బీసీసీఐ అద్భుతంగా వ్యవహరిస్తోంది. కానీ, ఐసీసీ తుది నిర్ణయాన్ని అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ టోర్నీ కచ్చితంగా హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లోనే జరిగే ఛాన్స్ ఉంది' అని కనేరియా అన్నాడు.
ICC సర్ప్రైజింగ్ షెడ్యూల్- టోర్నీలో భారత్ X పాక్ మ్యాచ్ లేదేంటి? - India vs Pakistan
'రిటైర్ అయ్యేలోపైనా పాక్‌కు రండి బ్రో!'- రోహిత్, విరాట్‌కు రిక్వెస్ట్ - Champions Trophy 2025