India Vs New Zealand Test Series : స్వల్ప టార్గెట్‌ను కాపాడుకొని భారత్ సంచలన విజయం సాధిస్తుందేమోనని ఆశించిన అభిమానులకు ఆఖరికి నిరాశే మిగిలింది. కేవలం 107 పరుగుల టార్గెట్‌ను రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు టామ్ లేథమ్ (0), డేవన్ కాన్వే (17) ఔటైనప్పటికీ, మరో వికెట్ పడనీయకుండా విల్ యంగ్ (45*), రచిన్ రవీంద్ర (39*) మూడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే చివరిసారిగా 1988లో భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ విజయం సాధించడం గమనార్హం. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను టీమ్‌ఇండియా ఓడిపోయింది.
మ్యాచ్ సాగిందిలా :
వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంతకుముందు మ్యాచ్‌లో నాలుగు బంతులు వేసిన బుమ్రా, ఆ ఓవర్‌ను పూర్తి చేసేందుకు వచ్చాడు. అయితే బుమ్రా వేసిన రెండో బంతికే కెప్టెన్ టామ్ లేథమ్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే తొలి వికెట్ పడ్డాక విల్ యంగ్‌తో కలిసి డేవన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ, మరోసారి బుమ్రా మాత్రం తన బౌలింగ్ స్కిల్స్‌తో కాన్వేను ఎల్బీ చేశాడు. ఆ టైమ్‌లో కివీస్ డీఆర్‌ఎస్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
చివరి రోజు మొదట్లో పేస్‌కు అనుకూలంగా మారడం వల్ల బుమ్రా, సిరాజ్ అద్భుతంగానే బౌలింగ్ చేశారు. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ కాస్త ఎండ రావడం వల్ల పిచ్ పరిస్థితుల్లోనూ మార్పులు చేకూరాయి. బుమ్రా కట్టుదిట్టంగా బంతులేసినప్పటికీ, సిరాజ్ మాత్రం వికెట్ తీయలేకపోయాడు. స్పిన్నర్లకూ పెద్దగా సహకారం కూడా లభించలేదు. రచిన్, విల్ యంగ్ దూకుడుగా ఆడి జట్టును ముందుకు నడిపించారు. దీంతో మన భారత స్పిన్నర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 46 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 పరుగులు
భారత్ రెండో ఇన్నింగ్స్: 462 పరుగులు
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 110/2
IPL మెగా వేలం: సర్ఫరాజ్‌పై ఆ రెండు ఫ్రాంచైజీల కన్ను- భారీ ధర ఖాయం!