IND VS New Zealand Kohli Gambhir : టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని, త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రపంచ స్థాయి క్రికెటర్ అని, చాలా కాలంపాటు అద్భుతమైన ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ప్రతి మ్యాచ్‌కు కోహ్లీ ఫామ్‌ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో విరాట్ వరుస టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ విఫలం అవ్వడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు.
"విరాట్ గురించి నా ఆలోచనలు ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంటాయి. కోహ్లీ ప్రపంచ స్థాయి క్రికెటర్. కొన్నేళ్ల పాటు ఆయన టీమ్ ఇండియా తరఫున అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం విరాట్‌లో, అరంగేట్రం చేసినప్పుడు ఉన్న పరుగులు దాహం ఉంది. ఈ ఆకలే అతన్ని వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ను చేసింది. శ్రీలంకతో మ్యాచులో కోహ్లీ అరంగేట్రం చేసినప్పుడు అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు గుర్తుంది. అతడిలో పరుగుల దాహం ఎప్పటికీ ఉంటుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లీ కచ్చితంగా సత్తా చాటుతాడు. అదే జోరును ఆస్ట్రేలియా సిరీస్ లోనూ కొనసాగిస్తాడని భావిస్తున్నాను. ఒక మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా ఆటగాడిని అంచనా వేయకూడదు. క్రీడల్లో ఆటగాళ్లు కొన్నిసార్లు విఫలమవుతుంటారు."
-గౌతమ్ గంభీర్, టీమ్ ఇండియా హెచ్ కోచ్
ప్రతి ఆటగాడికి అన్ని మంచి రోజులు ఉండవని గంభీర్ వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు జడ్జ్ చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డాడు. "మా ఆటగాళ్లకు మేం మద్దతు ఇస్తాం. జట్టుకు సరిపోయే 11 మందిని ఎంపిక చేయడం నా పని. జట్టు నుంచి ఆటగాళ్లను తొలగించడం కాదు. మేం జట్టుగా మంచి ఫలితాలు సాధిస్తుండటం బాగుంది." అని గంభీర్ పేర్కొన్నాడు.
"ఇది బౌలర్ల యుగం. బ్యాటర్లు 1,000 పరుగులు చేసినా, జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందనే గ్యారెంటీ లేదు. బౌలర్ 20 వికెట్లు తీస్తే, మ్యాచ్ గెలుస్తామని 99శాతం గ్యారెంటీ ఉంటుంది. అది టెస్ట్ లేదా ఇతర ఫార్మాట్ లోనైనా." అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
సిరీస్ షెడ్యూల్ - కాగా, బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. పుణె వేదికగా అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు జరగనుంది. ముంబయిలో నవంబర్ 1 నుంచి ఆఖరి టెస్టు జరగనుంది.
ధోనీపై గంభీర్‌కు ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది అప్పుడే! - గౌతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Gambhir About Dhoni
పాకిస్థాన్ గెలుపుపై భారత జట్టు ఆశలు! - అలా జరగకపోతే ఇక అంతే!