Ind vs SL 2nd ODI: శ్రీలంక కొలొంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 32 పరుగుల తేడాతో ఓడింది. శ్రీలంక నిర్దేశించిన 240 లక్ష్యాన్ని చేధించలేక, 208కే ఆలౌటైంది. అయితే ఓ దశలో టీమ్ఇండియా 97-0 పటిష్ఠ స్థితిలో ఉంది. కానీ, అనూహ్యంగా శ్రీలంక స్పిన్నర్ జెఫ్రి వాండర్సే టీమ్ఇండియాను తీవ్రంగా దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా 6 వికెట్లు నేలకూల్చి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఒక్క మ్యాచ్‌లో వాండర్సే చర్చనీయాంశంగా మారాడు. మరి ఈ వాండర్సే ఎవరు? ఎప్పుడు అరంగేట్రం చేశాడు?
అరంగేట్రంలోనే ఫెయిల్!
2015 జులైలో వాండర్సే శ్రీలంక తరఫున అరంగేట్రం చేశాడు. అతడు పాకిస్థాన్ (టీ20)తో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్లో వన్డే డెబ్యూ మ్యాచ్ ఆడాడు. అయితే అతడి అరంగేట్రంలో ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో వాండర్సే రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులు ఇచ్చుకున్నాడు. అందులో తొలి ఓవర్లోనే మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు సహా 26 సమర్పించుకున్నాడు.
అదే టర్నింగ్
ఆ తర్వాత వాండర్సేకు వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే 2017లో టెస్టులకు ఎంపికయ్యాడు. కానీ, 2022దాకా బరిలో దిగే ఛాన్స్ రాలేదు. టెస్టుల్లో కూడా 1మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. కానీ, అతడికి లిస్ట్ ఏ కెరీర్ మాత్రం టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పచ్చు. అందులో వాండర్సేకు మంచి అనుభవం ఉంది. కెరీర్లో 102 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడగా అందులో 150 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ 3560 పరుగులతో రాణించాడు.
సంవత్సరం బ్యాన్
2018లో శ్రీలంక క్రికెట్ బోర్డు వాండర్సేపై నిషేధం విధించింది. ఆ ఏడాది వెస్టిండీస్ పర్యటనలో బోర్డు నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిపై వేటు పడింది. వాండర్సేకు వార్షిక కాంట్రాక్ట్‌లో 20 శాతం ఫీజు కోత విధిస్తూ, లంక బోర్డు ఏడాది నిషేధం విధించింది.
అలా లక్కీ ఛాన్స్
భారత్‌తో వన్డే సిరీస్‌కు శ్రీలంక ముందుగా ఎంపికచేసిన జట్టులో వాండర్సేకు చోటు లేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా గాయం కారణంగా సిరీస్‌కు దూరమవడం వల్ల వాండర్సేకు పిలుపు అందింది. దీంతో జట్టులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి, తొలి మ్యాచ్‌లోనే 6వికెట్లతో అదరగొట్టాడు.