IND vs SA U19 Semi Final : అండర్-19 ప్రపంచకప్‌లో యంగ్ టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం సౌతాఫ్రికాతో బెనోని వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దిగ్విజయంగా ఫైనల్ సమరంలోకి అడుగుపెట్టింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 244 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 8 వికెట్లు కోల్పోయి మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు 9 సార్లు ఫైనల్స్ ఆడిన భారత్ ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచింది.
ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఇన్నింగ్స్
బ్యాటింగ్‌కు దిగిన యువభారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్వెనా మఫాకా వేసిన తొలి బంతికే ప్రెటోరియస్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఆదర్శ్ సింగ్ డకౌట్‌గా అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన ముషీర్ ఖాన్ (4) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. దీంతో 11.2 ఓవర్లకే టీమ్ఇండియా కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికి టీమ్ స్కోరు 32 పరుగులే. దీంతో టీమ్ఇండియా తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది. సెకండ్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఉదయ్ సహరన్ (81*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక వైపు వికెట్లు పడిపోతున్నా, క్రీజులో ఉండిపోయాడు. సచిన్‌దాస్ (96) గ్రౌండ్‌లోకి వచ్చాక మ్యాచ్ తలకిందులయ్యింది. అగ్రెసివ్‌గా ఆడి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి ఆచితూచి ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు.
అయితే వీరి పార్టనర్‌షిప్‌ను క్వెన్ మఫాకా విడగొట్టాడు. జట్టు స్కోరు 203 పరుగుల వద్ద భారీషాట్‌కు ప్రయత్నించిన సచిన్‌దాస్ డేవిడ్ టీగర్ చేతికి చిక్కాడు. అప్పటికి టీమ్ఇండియా విజయం సాధించాలంటే 47 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన సమయంలో ఉదయ్ సహరన్ క్రీజులో ఉండటం వల్ల విజయంపై అంతా ధీమాగానే ఉన్నారు. అయితే, చివర్లో అవినాశ్ (10), అభిషేక్ (0) నిరాశపరచడం వల్ల ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. చివరికి ఒక్కపరుగు చేయాల్సి ఉండగా సహరన్ రనౌట్‌గా వెనుదిరగాడు. రాజ్ లింబాని (10*) ఫోర్ బాది లక్ష్యాన్ని పూర్తి చేసేశాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా, ట్రిస్టాన్‌లూస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కూడా మంచి స్కోరే చేసింది. ఓవైపు టీమ్ఇండియా బౌలర్లు విరుచుకుపడుతున్నా వారిని ఎదుర్కొన్నారు. దీంతో ఆ జట్టు 244 పరుగులు సాధించింది. ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్‌వేన్ (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని మూడు వికెట్లతో అదరగొట్టాడు. ముషీర్‌ఖాన్ రెండు, నమన్ తివారీ, సౌమీ పాండే చెరో వికెట్ పడగొట్టారు.
భారత్ x జింబాబ్వే టూర్ ఫిక్స్ - వరల్డ్ కప్ తర్వాత బిజీ షెడ్యూల్
టెస్టుల్లో కేన్ దూకుడు - రెండు ఇన్నింగ్స్‌లో మూడు రికార్డులు