IND vs NZ 3rd Test 2024 : సొంత గడ్డపై టీమ్ఇండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ ఓడి, స్వదేశంలో టెస్టుల్లో తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్ 25 పరుగుల తేడాతో ఓడింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6, గ్లెన్ ఫిలిప్ 3, మ్యాట్ హెన్రీ 1 వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన కివీస్ తాజా విజయంతో 3-0తో ఈ సిరీస్ దక్కించుకుంది.
లక్ష్యం చిన్నదే అయినప్పటికీ పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడం వల్ల పరుగులు రావడం కష్టమైంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ (11 పరుగులు) రెండు ఫోర్లు బాది ఊపుమీద కనిపించాడు. ఇక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 13 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత శుభ్‌మన్ గిల్ (1) బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1 పరుగు), యశస్వీ జెస్వాల్ (5), సర్ఫరాజ్ ఖాన్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న పంత్
29-5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను రిషభ్ పంత్ ఆదుకున్నాడు. జడేజా (64 పరుగులు) తో కలిసి 42 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. దీంతో భారత్ కోలుకుందని అనిపించింది. కానీ, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో జడ్డూ ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి పంత్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక పంత్ ఔటయ్యాక టీమ్ఇండియా వికెట్లు టపటపా కూలాయి. దీంతో భారత్ తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.
అంతకుముందు 171-9తో మూడో రోజు ప్రారంభించిన కివీస్ మరో 3 పరుగులకే ఆఖరి వికెట్ కూడా కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (51 పరుగులు) ఒక్కడే రాణించాడు. డేవన్ కాన్వే (22 పరుగులు), రచిన్ రవీంద్ర (4 పరుగులు), డారిల్ మిచెల్ (21 పరుగులు), టామ్ బ్లండెల్ (4 పరుగులు), గ్లెన్ ఫిలిప్ (26 పరుగులు) ఇష్ సొథి (8 పరుగులు), మ్యాట్ హెన్రీ (10 పరుగులు) తేలిపోయారు. టీమ్ఇండియా బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 3, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
#TeamIndia came close to the target but it's New Zealand who win the Third Test by 25 runs.
— BCCI (@BCCI) November 3, 2024
Scorecard - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4BoVWm5HQP
స్కోర్లు
- న్యూజిలాండ్ : 235 & 174
- భారత్ : 263 & 121