Ind vs Eng 5th Test 2024: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ 64 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో నెగ్గింది. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం వల్ల మూడో రోజే మ్యాచ్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 195 పరుగులకే చేతులెత్తేసింది. జో రూట్ (84) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. టీమ్ఇండియా బౌలర్లలో అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2, రవీంద్ర జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు', యశస్వీ జైస్వాల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కాయి.
ఇక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (79 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. బెన్ డకెట్ (27), ఓలీ పోప్ (11), జో రూట్ (26), బెయిర్ స్టో (29), స్టోక్స్ (0), ఫోక్స్ (24) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4, రవీంద్ర జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (103 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (110 పరుగులు) సెంచరీలతో అదరగొట్టాగా, కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56), దేవదత్ పడిక్కల్ (65) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ తలో 2, బెన్ స్టోక్స్ 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోనే టీమ్ఇండియాకు 259 పరుగుల ఆధిక్యం లభించింది.
స్కోర్లు ఇలా
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 218/10
- భారత్ తొలి ఇన్నింగ్స్- 477/10
- ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్- 195/10
సర్ఫరాజ్‌పై మాజీ బ్యాటర్ ఫైర్ - 'ఆ చెత్త షాట్ ఇప్పుడు అవసరమా?'