Ind vs Eng 3rd Test 2024: రాజ్‌కోట్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 196-2తో నిలిచింది. దీంతో ప్రస్తుతం భారత్ 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హర్ట్లీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక నాలుగో రోజు ఆట ఇరుజట్లకు అత్యంత కీలకం కానుంది.
యశస్వి సూపర్ సెంచరీ: యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (104 రిటైర్డ్ హర్ట్) సెంచరీతో అదరగొట్టాడు. జైశ్వాల్, గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ 155 పరుగులు జోడించారు. జైశ్వాల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. కాగా, జైశ్వాల్‌కు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చిన గిల్ అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (19 పరుగులు) స్వల్ప స్కోరుకే వెనుదిరిగ్గా, రజత్ పటిదార్ (0) మరోసారి పటీదార్ నిరాశపర్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 319 పరుగులకు కుప్పకూలింది. ఓనర్నైట్ స్కోర్ 207-2తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 112 పరుగులు జోడించి ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మూడో రోజు తొలి సెషన్లో టీమ్ఇండియా పేసర్ సిరాజ్ ప్రత్యర్థి జట్టును అద్భుతంగా కట్టడి చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (18), జానీ బెయిర్ స్టో (0), ఫోక్స్ (13), రెహాన్ అహ్మద్ (6), టామ్ హర్ల్టీ (9), మార్క్ వుడ్ (4*), జేమ్స్ అండర్సన్ (1) వరుసగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
సిరాజ్ మెరుపులు - 319 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
జైస్వాల్ సూపర్ క్యాచ్ - మెరుపు వేగంతో ఇంగ్లాండ్ వికెట్ డౌన్