IND Vs BAN T20 Uppal : ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. బంగ్లాతో జరిగిన మూడో టీ20లో భారత ఆటగాళ్లు విజృంభించారు. సంజు శాంసన్ (111; 47 బంతుల్లో), సూర్యకుమార్ (75; 35 బంతుల్లో) చెలరేగిపోయారు. చివర్లో హార్దిక్ పాండ్య (47; 18 బంతుల్లో) చెలరేగిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు వికెట్ నష్టానికి భారత్ 297 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు టీ20ల్లో ఉన్న 260 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో అధిగమించింది. ఆఖర్లో బ్యాటర్లు తడబడడంతో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (314) కాస్త దూరంలో నిలిచింది. లేకుంటే ప్రపంచ రికార్డు నమోదయ్యేది.
భిషేక్ శర్మ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా సూర్య కుమార్ యాదవ్ (65), సంజూ శాంసన్ బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. రిషద్ వేసిన పదో ఓవర్‌లో సంజూ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. రెండో బంతి మినహా ఆ ఓవర్‌లో అన్ని బంతులనూ సిక్సర్ల బాట పట్టించాడు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో తొలి శతకం నమోదు చేసిన సంజు శాంసన్ రోహిత్ శర్మ 100 (35 బంతుల్లో) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వేగంగా శతకాలు బాదేసిన వారిలో డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో), రోహిత్ శర్మ (35), జాన్సన్ చార్లెస్ (39) తొలి మూడు స్థానాల్లో ఉండగా సంజు శాంసన్ 40 బంతుల్లో శతకంతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
బంగ్లాతో మ్యాచ్‌లో రికార్డులు
- టీ20ల్లో అత్యధిక బౌండరీల రికార్డు నమోదు (47)
- టీ20ల్లో బెస్ట్ పవర్ ప్లే స్కోర్- 82/1
- వేగవంతమైన 100- 7.1 ఓవర్లలో
- మొదటి 10 ఓవర్లలో బెస్ట్ స్కోర్- 146/1
- టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ
- వేగవంతమైన జట్టు స్కోరు 200- 14 ఓవర్లలో
- టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రెండో టీమ్‌గా రికార్డు (297)