ICC Chairman Indians: బీసీసీఐ కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబరు 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని గ్రెగ్ బార్ క్లే నిర్ణయించుకోవడం వల్ల బీసీసీఐ కార్యదర్శి జై షా ఆ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐసీసీ వ్యవహారాల్లో బీసీసీఐది కీలక పాత్ర కావడం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మద్దతు జైషాకు ఉండడం వల్ల ఐసీసీ అధ్యక్ష పదవి ఆయన వరించనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐసీసీ ఛైర్మన్లుగా పనిచేసిన భారతీయులు ఎంత మంది? వారెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జగ్మోహన్ దాల్మియా (1997-2000): భారత్, ఆసియా తరఫున మొదటి ఐసీసీ ఛైర్మన్‌గా జగ్మోహన్ దాల్మియా చరిత్ర సృష్టించారు. దాల్మియా ఈ పదవిలో 1997- 2000 వరకు కొనసాగారు. ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్‌గా దాల్మియా ఎన్నికయ్యారు. అంతకుముందు 1996లో ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ చేసి త్రుటిలో దాన్ని కోల్పోయారు. ఆస్ట్రేలియాకు చెందిన మాల్కం గ్రేపై జగ్మోహన్ దాల్మియా పోటీ చేసి 23 ఓట్లను పొందారు. మాల్కం గ్రేకు 13 ఓట్లే వచ్చాయి. అయినా ఛైర్మన్ పదవి చేపట్టేందుకు ఐసీసీ రూల్స్ ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు రావాలి. దీంతో జగ్మోహన్ త్రుటిలో ఛైర్మన్ పదవిని కోల్పోయారు.
శరద్ పవార్ (2010-2012): భారత దిగ్గజ రాజకీయ నాయకుల్లో శరద్ పవార్ ఒకరు. ఈయన నాలుగుసార్లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. అయితే రాజకీయాల్లోనే కాదు క్రికెట్ లోనూ శరద్ పవార్ చక్రం తిప్పారు. 2005-2008లో పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2010లో ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగారు.
ఎన్. శ్రీనివాసన్ (2014-2015): ఎన్. శ్రీనివాసన్ బీసీసీఐ కార్యదర్శిగా తొలుత పనిచేశారు. ఆ తర్వాత 2011లో శశాంక్ మనోహర్ నుంచి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. 2014 వరకు శ్రీనివాసన్ ఈ పదవిలో కొనసాగారు. 2014లో ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగారు.
శశాంక్ మనోహర్ (2015-2020): ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ 2015 నుంచి 2020 వరకు కొనసాగారు. ఇది ఏ భారతీయుడికైనా సుదీర్ఘమైన పదవీకాలం. కాగా, శశాంక్ మనోహర్ 1996లో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయనకు రాజకీయ నాయకుడు, ఐసీసీ మాజీ ఛైర్మన్ శరద్ పవార్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. 2008లో శశాంక్ తొలిసారి బీసీసీఐ అధ్యక్షుడు అయ్యారు. మూడేళ్ల పాటు ఆయన అదే పదవిలో కొనసాగారు. ఆ సమయంలోనే ఐపీఎల్ ప్రారంభమైంది. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో 2015లో మరోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఆ ఏడాదిలోనే ఐసీసీ ఛైర్మన్ పదవిని స్వీకరించారు.
ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎందుకు అంత ప్రాధాన్యం?
ప్రపంచ క్రికెట్లో ఐసీసీది ప్రత్యేక స్థానం. అందుకే ఐసీసీ ఛైర్మన్ పదవికి అంతలా పేరు ఉంది. ఐసీసీ ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు నేతృత్వం వహిస్తారు. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉంటాయి. 9 ఓట్లు వచ్చిన వ్యక్తి విజయం సాధిస్తారు. ఇంతకు ముందు ఛైర్మన్ పగ్గాలు చేపట్టాలంటే మూడింట రెండొంతుల ఓట్లు పొందాలనే నిబంధన ఉండేది. కాగా, షా ఇప్పుడు ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతి. ఓటు హక్కు ఉన్న చాలా దేశాలు షా పట్ల సానుకూలతతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అంటున్నారు.
BCCI సెక్రట్రీ రేసులో ఆ ముగ్గురు మాజీలు - ఎవరు వస్తే ఏం చేస్తారంటే।? - BCCI Secretary Post
బంగ్లా క్రికెట్ బోర్డు డైరెక్టర్ రాజీనామా- త్వరలోనే అధ్యక్షుడు కూడా? - Bangladesh Cricket Board