Harbhajan Singh T20 World Cup 2024 : ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచి ఎంతో మంది కల నెరవేర్చింది. ఆ జట్టు రోహిత్ శర్మ తన టీమ్ మేట్స్‌కు దిశానిర్దేశం చేస్తూ జట్టును ఎంతో చక్కగా విజయతీరాలకు చేర్చాడో కూడా అందరూ చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని పలువురు మాజీలు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే తాజాగా రోహిత్ కెప్టెన్సీ గురించి అలాగే 2024 టీ20 ప్రపంచకప్ భారత జట్టు గురించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2007 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కంటే రోహిత్ సేనలో ఎక్కువమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని ఆయన అన్నారు.
"2024 భారత్ వరల్డ్ కప్ విజేతగా నిలవడం నాకు ఎంతో ఆనందానిచ్చింది. ఈ జట్టులో మ్యాచ్ విన్నర్లు చాలామంది ఉన్నారు. మా జట్టులో అప్పుడు (2007లో) పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. మాకు ఆ ఫార్మాట్ కూడా కొత్తనే. చాలామంది తొలిసారి ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అంతేకాకుండా మేం టీ20లపై అంతగా ఫోకస్ కూడా పెట్టలేదు. కానీ, విజయం సాధించాలనే లక్ష్యంతోనే మేం బరిలోకి దిగాం. ఆఖరికి కప్ సాధించాం. 2007 జట్టులో వీరూ, యువీ, నాతోపాటు అజిత్ అగార్కర్ కాస్త ఎక్కువ క్రికెట్ అనుభవం కలిగిన మెంబర్స్. మిగతావారందరూ కొత్తవారే. ఎంఎస్ ధోనీ కూడా కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, చిన్న చిన్న భాగస్వామ్యాలే మా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. దినేశ్ కార్తిక్ (డీకే) గ్రేమ్ స్మిత్ క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన క్షణం నాకిప్పటికీ గుర్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడున్న జట్టును చూస్తే ఆడిన ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. రోహిత్, విరాట్, రిషభ్, సూర్య, హార్దిక్ ఇలా ప్రతిఒక్కరూ పొట్టి ఫార్మాట్‌లో అంతకుముందే చాలా మ్యాచ్‌లు ఆడారు. ఈ టోర్నీలో యంగ్ ప్లేయర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో అతడి ప్రదర్శన చాలా అద్భుతంగా అనిపించింది. బుమ్రాతో కలిసి అర్షదీప్ బౌలింగ్ ఎంతో అద్భుతంగా సాగింది. ఐపీఎల్ వంటి లీగుల్లో అర్ష్‌దీప్ అనుభవం గడించాడు" అంటూ హర్భజన్ రోహిత్ సేనను పొగడ్తలతో ముంచెత్తారు.
హర్భజన్ దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్ క్రికెటర్ - ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు - T20 Worldcup 2024
యువరాజ్ టు సెహ్వాగ్ - ఈ స్టార్ క్రికెటర్లకు నో ఫేర్వెల్!