French Open 2024 Chirag Shetty and Rankireddy : భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్ - చిరాగ్ శెట్టి జోడీ మళ్లీ అదరగొట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ టైటల్‌ను ముద్దాడింది. త్వరలో జరగనున్న ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ జోడీ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో వరల్డ్ ఛాంపియన్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈటోర్నీలో సెమీస్‌లో అదరగొట్టిన సాత్విక్ - చిరాగ్ శెట్టి జోడీ ఆదివారం జరిగిన ఫైనల్లోనూ దూకుడుగా ఆడి విజయం సాధించింది. ఫైనల్లో చైనీస్ తైపీ జంట లీ జి హుయ్- యాంగ్పొ సువాన్‌పై భారత ద్వయం 21-11, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో నెగ్గారు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ విభాగంలో టైటిల్ సాధించడం ఈ జోడీకి ఇది రెండోసారి కావడం విశేషం.
రసవత్తరంగా సాగుతుందనుకున్న తుదిపోరును మన బ్యాడ్మింటన్ స్టార్లు కేవలం 37 నిమిషాల్లోనే పూర్తిచేశారు. ఈ కాస్త సమయంలోనూ భారత ద్వయం ప్రత్యర్థి జోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 15 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించారు. తొలుత 4-4తో స్కోరుగా సమంగా ఉండటంతో హోరాహోరీ పోరుగా సాగుతుందనుకుంటే వన్‌సైడ్‌గా మారింది. సాత్విక్-చిరాగ్ అద్భుత ఆటతో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు.
ఇక తొలి గేమ్‌లో దూసుకు వెళ్లిన ఈ ద్వయం రెండో గేమ్‌లో మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రెండో గేమ్‌లో కూడా ప్రత్యర్ధి జోడీని సాత్విక్ - చిరాగ్ శెట్టి ద్వయం నిలువరించగలిగింది. శక్తిమంతమైన స్మాష్‌లతో, మెరుపు దాడులతో ప్రత్యర్థిని ఓడించింది. తద్వారా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో 100,000 పాయింట్స్ సాధించిన తొలి భారత జోడీగా నిలిచింది. ఇక ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ షి యుకీ గెలుపొందాడు. అతడు తన ప్రత్యర్థి థాయ్‌లాండ్ స్టార్ కునావుట్‌పై 22-20, 21-19 తేడాతో విజయం సాధించాడు.
WPL 2024 ఉత్కంఠ మ్యాచ్‌లో ఆర్సీబీపై దిల్లీ విజయం - ప్లేఆఫ్స్‌కు అర్హత