First International Match In Cricket : భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. మనలో చాలా మంది క్రికెట్ మ్యాచ్ ఉందంటే, మిగిలిన పనులను ప్రక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతాము. అయితే మనం ఎంతగానో అభిమానించే ఈ క్రికెట్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఏయే జట్లు మధ్య జరిగింది? ఎప్పుడు జరిగింది? భారత్ ఆడిన తొలి ఇంటర్నేషన్ మ్యాచ్ ఏది? తదితర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మొదటి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
1844లో న్యూయార్క్‌లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్లో అమెరికా, కెనడా మధ్య మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెనడా 23 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది.
ఇదీ అసలు విషయం
అయితే చాలా మంది 1877లో మెల్ బోర్న్లో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను మొదటి అంతర్జాతీయ మ్యాచ్ అనుకుంటారు. అయితే అది కరెక్ట్ కాదు. అమెరికా- కెనడా మధ్య 1844లో జరిగిన వన్డే మ్యాచే క్రికెట్ చరిత్రలో తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఇది మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఏ క్రీడలోనైనా రెండు దేశాల మధ్య జరిగిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం.
మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మెల్ బోర్న్ వేదికగా 1877 మార్చి 15- 19 తేదీల మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదటి క్రికెట్ ప్రపంచ కప్ ఎప్పుడు జరిగింది?
మొదటి ప్రపంచ కప్ 1975 జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రారంభం ఎప్పుడు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 1909లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ప్రతినిధులతో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత దీన్ని 1965లో ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా పేరు మార్చారు. 1987లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)గా నామకరణం చేశారు. దీని ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది.
భారత్ జట్టు ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఏది?
1932 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది. అప్పుడు టీమ్ఇండియాకు సీకే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
భారత్‌లో జరిగిన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఏది?
భారత్‌లో మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ 1933లో జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్- భారత్ తలపడ్డాయి.
క్రికెట్ హిస్టరీలో 'లాంగెస్ట్ టెస్టు'- 9రోజులు సాగిన ఆట - Longest Test Match
లైక్ ఫాదర్, లైక్ సన్- టీమ్ఇండియాకు ఆడిన తండ్రీకొడుకులు వీళ్లే! - Father And Son In Cricket