Fab 4 Most Player Of The Series : సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ నలుగురూ ఆధునిక క్రికెట్ దిగ్గజాలుగా పేరొందారు. కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 80 శతకాలతో సత్తాచాటగా, టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు. మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమదైన మార్కును చూపిస్తూ తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అందుకే ఈ నలుగురిని కలిపి 'ఫ్యాబ్ ఫోర్'గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రియులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఫ్యాబ్ ఫోర్ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు. అంతలా నిలకడైన ఆట తీరును ప్రదర్శిస్తారు ఈ నలుగురు క్రికెటర్లు. ఈ క్రమంలో ఫ్యాబ్ ఫోర్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు గెలుచుకున్నది ఎవరు? ఆఖరి స్థానంలో ఎవరున్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
జో రూట్
ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జోరూట్ తన కెరీర్లో మొత్తం ఆరు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను గెలుచుకున్నాడు. అందుకే జోరూట్ ఫ్యాబ్ ఫోర్లో ఎక్కువ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'లు గెలుచుకున్న ప్లేయర్ గా నిలిచాడు.
రూట్ తనదైన స్ట్రోక్ ప్లే, సొగసైన బ్యాటింగ్‌తో అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో బాగా రాణిస్తున్నాడు. కీలకమైన మ్యాచుల్లో రాణించి ఇంగ్లాండ్‌కు విజయాలను తెచ్చిపెడుతున్నాడు. ఇటు ఇంగ్లాండ్ కెప్టెన్‌గానూ రూట్ రాణించాడు. చాలా సిరీస్‌లో తన నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అందుకే రూట్ ఎక్కువ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను గెలుచున్నాడు.
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ తన కెరీర్లో మొత్తం 4 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను గెలుచుకున్నాడు. అతడి నిలకడైన ఆటతో జట్టును చాలా మ్యాచ్‌లల్లో గెలిపించాడు స్టీవ్ స్మిత్. ముఖ్యంగా వన్డే, టెస్టు ఫార్మాట్లో సత్తా చాటాడు. ప్రత్యర్థుల అసాధారణ బౌలింగ్‌ను సైతం ఎదుర్కొని స్మిత్ రాణిస్తున్నాడు.
కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ సైలంట్‌గానే సెన్సేషన్స్ సృష్టిస్తుంటాడు. ఇప్పటివరకు అతడు నాలుగు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను సాధించాడు. అద్భుతమైన టెక్నిక్, టైమింగ్‌తో పరుగులు చేస్తాడు విలియమ్సన్.
విరాట్ కోహ్లీ :
టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీని క్రికెట్ ప్రియులు రన్ మెషీన్‌గా అభివర్ణిస్తుంటారు. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ అదరగొట్టేస్తుంటాడు. అయితే కింగ్ కోహ్లీ కేవలం తన కెరీర్ మూడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లను మాత్రమే గెలుచుకున్నాడు. ఫ్యాబ్ ఫోర్లో కోహ్లీ ఆఖరి స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'కు ఎంపిక కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
- కోహ్లీ తరచుగా పోటీ తీవ్రంగా ఉన్న సిరీస్‌లలో ఆడుతాడు. ఈ సిరీసుల్లో టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటివారు ఆడుతారు. ఆ సిరీసుల్లో వీరు రాణించడం వల్ల కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కొన్నిసార్లు దక్కకపోవచ్చు.
టెస్టులతో పోలిస్తే వన్డే, టీ20ల్లో కోహ్లీ బాగా రాణిస్తుంటాడు. ఫ్యాబ్ ఫోర్లో మిగతావారందరూ టెస్టులో రాణించారు. వారందరూ టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్నారు.
కెప్టెన్సీ వల్ల కోహ్లీ కొన్నిసార్లు వ్యక్తిగత ప్రదర్శన చేయలేకపోయాడు. అలాగే సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో అదరగొట్టినా, మరికొన్నింట్లో విఫలమవ్వడం వల్ల ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లను ఎక్కువ సాధించలేకపోయారు.